జిల్లాలో 76 పంచాయతీలు ఏకగ్రీవం

7 Aug, 2013 04:34 IST|Sakshi

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి, ప్రజల్లో ఐకమత్యం పెంపొందించడానికి ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుంది. ఏకగ్రీవమైన పంచాయతీలను ప్రోత్సహించడానికి నజరానాలు కూడా ఇస్తుంది. ఇటువంటి పంచాయతీలను రెండు కేటగిరీలుగా చేసి నిధులు మంజూరు చేస్తున్నారు. 15వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.7 లక్షలు, 15వేల కంటే అధికంగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20 లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. గత నెల 21, 23, 27 తేదీల్లో జిల్లాలోని 866 పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ముందు జిల్లావ్యాప్తంగా 84 పంచాయతీల్లో ప్రజలు సర్పంచ్‌లను ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు. ఇందులో 76 గ్రామాల్లో సర్పంచ్‌లతోపాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీటికి మాత్రమే పారితోషకం కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. ఏకగ్రీవమైన పంచాయతీలకు దాదాపు రూ.5 కోట్లకుపైగా నిధు లు వచ్చే అవకాశం ఉంది. కాగా 2006లో జిల్లాలోని 866 పంచాయతీలకు 49 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అప్పట్లో ఒక్కో ఏకగ్రీవ పంచాయతీకి రూ.5 లక్షలు చొప్పున పారితోషకం అందజేశారు.
 
 పారితోషికం ఖర్చులు ఇలా..
 గ్రామంలో సర్పంచ్‌తోపాటు గ్రామాల్లో ఉన్న వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే దానిని ఎంటైర్‌బాడీ గుర్తిస్తారు. ఇలాంటి ఏకగ్రీవ పంచాయతీకి ప్రభుత్వం పారితోషకం ఇస్తుంది. ఈ నిధులను ఒక్కో పంచాయతీలో మొదటగా పర్మినెంట్‌గా ఉండే పంచాయతీ భవన నిర్మాణానికి, స్థలానికి, మురికివాడల్లో సమస్యలను పరి ష్కరించేందుకు, మురికికాలువలు శుభ్రం చేసేందుకు, గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టేందుకు, అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాలి.
 
 అందుబాటులో రూ.12 కోట్ల నిధులు
 జిల్లాలోని గ్రామ పంచాయతీల ఖాతాల్లో దాదాపు రూ.12 కోట్ల నిధుల వరకు అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల ప్రత్యేక పాలనలో ప్రతి మండలానికి జనరల్ ఫండ్స్ కింద రూ.16 కోట్ల నుంచి రూ.18 కోట్లు విడుదలైనట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కో మండలంలో రూ.4 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉండవచ్చని అధికారుల అంచనా. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.12 కోట్లు ఉన్నట్లు అధికారుల ద్వారా సమాచారం. గ్రామాల్లో కొత్తగా కొలువుదీరిన సర్పంచ్‌లు చేపట్టే అభివృద్ధి పనులకు ఆ నిధులు ఉపయోగపడనున్నాయి. రెండేళ్ల ప్రత్యేక అధికారుల పాలన లో గ్రామీణులు నరకం చూశారు. నిధులున్నా ప్రత్యేకాధికారుల తీరు.. గ్రామాల అభివృద్ధిని కుంటుపడేలా చేసిం ది. అయితే ఖర్చుపెట్టని నిధులు ఇప్పుడు కొత్త సర్పంచ్‌లకు అందుబాటులోకి రానున్నాయి. పనులు చేయించిన గ్రామ పంచాయతీల్లో తక్కువగా, చేయని గ్రామాల్లో ఎక్కువగా, ఇలా చూస్తే ఒక్కో గ్రామ పంచాయతీల ఖాతాలో దాదాపు రూ.4 వేల నుంచి రూ.17 లక్షల వరకు నిధులు అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రస్తుతం నూ తనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లకు నిధుల కొరత లేకుండా పోయిందని అధికారులే చర్చించుకోవ డం గమనార్హం. అధికారికంగా చెక్‌పవర్ అందితే తాము హామీ ఇచ్చిన మేరకు సర్పంచ్‌లు అభివృద్ధి పనులు చేపట్టేందుకు సమాయత్తం కావాల్సి ఉంది.
 
 జీపీల ఖాతాల్లో ఉంటే ఉండొచ్చు..
 - పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి
 రెండేళ్లుగా సర్పంచ్‌లు లేకుండా కొనసాగిన ప్రత్యేక అధికారుల పాలనలో మండలాల్లోని కొన్ని గ్రామాల్లో ఖర్చులు చేశారు. గ్రామాల్లోని ఆయా అవసరాలను బట్టి అధికారులు ఖర్చు చేసి ఉండొచ్చు. ఆ విధంగా జీపీల ఖాతాల్లో నిధులు జమ ఉంటాయి. అవసరాలను బట్టి నిధులను ఖర్చు చేస్తే కచ్చితంగా ఉండే ఉంటుంది. ఇప్పటి వరకు జీపీల ఖాతాల్లో జమ ఉన్నట్లు మాత్రం తెలియదు. ప్రస్తుతం గ్రామాల్లో పని చేసే సిబ్బందికి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని వార్తలు