స్విస్ చాలెంజ్‌పై ఏడు కంపెనీల ఆసక్తి

9 Aug, 2016 02:37 IST|Sakshi
స్విస్ చాలెంజ్‌పై ఏడు కంపెనీల ఆసక్తి

ప్రీ బిడ్ సమావేశంలో సందేహాల వ్యక్తీకరణ
సాక్షి, అమరావతి: సీడ్ రాజధానిలోని స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పిలిచిన బిడ్‌పై ఏడు సంస్థలు ఆసక్తి కనబరిచాయి. దీనికి సంబంధించి ప్రీ బిడ్ సమావేశం సోమవారం సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లోంజీ, రాంకీ గ్రూపు, అలియన్స్ ఇన్‌ఫ్రా, చైనాకు చెందిన జీఐఐసీ, చైనా ఫస్ట్ మెటలర్జికల్ కంపెనీలు పాల్గొన్నాయి. సీడ్ రాజధానిలో 6.84 చదరపు కిలోమీటర్ల స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్‌కు చెందిన కన్సార్టియం అసెండాస్-సిన్‌బ్రిడ్జి అండ్ సెంబ్ కార్ప్ డెవలప్‌మెంట్ కంపెనీ ప్రతిపాదనలు సమర్పించిన విషయం తెలిసిందే.

ఇంతకంటె మెరుగైన ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ స్విస్ చాలెంజ్ విధానంలో గత నెల 17న సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. ఇందులో భాగంగా నిర్వహించిన ఈ ప్రీ బిడ్ సమావేశంలో పాల్గొన్న ఏడు కంపెనీలూ తమ సందేహాలు వ్యక్తం చేశాయి. వీటిని లిఖిత పూర్వకంగా ఇస్తే వాటికి తగిన సమాధానాలను ఇ-ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలను చాలెంజ్ చేస్తూ సెప్టెంబర్ 1లోపు ఎవరైనా బిడ్‌లను దాఖలు చేసే అవకాశం ఉంది. సమావేశంలో సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ రామమనోహరరావు, ఎకనామిక్ డెవలప్‌మెంట్ డెరైక్టర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు