హతవిధి.. మాధురీ!

6 Oct, 2017 09:24 IST|Sakshi

సువర్ణముఖి నదిలో పడి చిన్నారి గల్లంతు

పాఠశాల సమయంలో నదివైపు వెళ్లిన బాలిక

చిన్నారికోసం విస్తృతంగా గాలింపు

ఇంకా లభ్యం కాని ఆచూకీ

బలిజిపేట మండలం

నారాయణపురంలో ఘటన

బలిజిపేట(పార్వతీపురం): మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక సువర్ణముఖి నదిలో గల్లంతైంది. గ్రామస్తులందరికీ దిగ్భ్రాంతి కలిగించిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, బాలిక తండ్రి అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గలావల్లి మాధురి(7) స్థానిక ఎలిమెంటరీ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. గురువారం మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తరువాత పాఠశాల నుంచి తోటి పిల్లలతో బయటకు వచ్చి పాఠశాలకు సమీపంలో ఉన్న నది గూళ్ల రేవువైపు వెళ్లి, అంతలోనే నదిలోజారిపోయింది.

 నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బాలిక అందులో కొట్టుకుపోయింది. ఆమెతో వచ్చిన పిల్లలు వెంటనే ఆ సమాచారాన్ని మాధురి తండ్రి నారాయణరావుకు అందజేశారు. వారు అక్కడకు చేరుకునే సరికే సమీపంలో ఉన్న కొందరు నదిలో వెదకడం మొదలు పెట్టారు. పాఠశాల ఉపాధ్యాయులు కూడా అక్కడకు చేరుకుని ఆవేదన చెందారు. సాయంత్రం వరకూ గూళ్ల రేవునుంచి చాకరాపల్లి వరకూ నదిలో వెదికినప్పటికీ ఫలితం కనిపించలేదు.

కన్నవారికి కడుపుకోత
నారాయణరావు, సరస్వతిలకు ఇద్దరు సంతానం. వీరిలో గల్లంతయిన మాధురి పెద్దది. ఐదేళ్ల బాబు కూడా ఉన్నాడు.  నారాయణరావు కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పిల్లను చదివించాలనే తపనతో పాఠశాలకు పంపించాడు. చిన్నారి గల్లంతైన విషయం తెలుసుకుని ఆ తల్లి రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడిపెట్టించింది.

పాఠశాల సమయంలో ఎలా వదిలారు:
విద్యార్థులను పాఠశాల సమయంలో బయటకు పంపకుండా జాగ్రత్తగా చూసుకోవలసిన ఉపాధ్యాయులదే. అయితే వారు అంత నిర్లక్ష్యంగా ఎలా వదిలివేశారని స్థానికులు నిలదీస్తున్నారు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్‌ సాక్షితో మాట్లాడుతూ 2గంటల సమయం దాటిన తరువాత 5వ తరగతి పిల్లలతో కలసి మాధురి బయటకు వెళ్లిందనీ, ఆ సమయంలో ఉపాధ్యాయులంతా తరగతి గదుల్లో ఉన్నారని తెలిపారు. తోటి పిల్లలు వచ్చి విషయం తెలపడంతో అంతా అప్రమత్తమై వెదకడం మొదలుపెట్టామని వివరించారు.

మరిన్ని వార్తలు