గండికోటలో 8 ఫిరంగి గుండ్లు

1 Mar, 2020 10:45 IST|Sakshi
ఫిరంగి గుండ్లు

అభివృద్ధి పనులు చేస్తుండగా బయల్పడిన వైనం

ఒక్కొక్కటి 15 నుంచి 18 కేజీల బరువు

సాక్షి, జమ్మలమడుగు : పర్యాటక కేంద్రమైన గండికోటలో 8 ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. గుండ్లు ఒక్కొక్కటి 15 కేజీల నుంచి 18 కేజీలు మరికొన్ని 12 కేజీల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. గండికోటలో కొన్ని రోజుల నుంచి కోనేరు సమీపం ప్రాంతంలో ఉన్న ముళ్ల పొదలను తొలగించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం నీటి తొట్టి బయటపడింది. అదే రోజు ఒక ఫిరంగి గుండు దొరికింది. శనివారం కూలీలతో పనులు చేయిస్తుండగా.. పూరాతన కాలం నాటి ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. 

గుండ్లు దొరికిన ప్రదేశం 
400 ఏళ్ల నాటివి: గండికోటలో బయటపడ్డ ఫిరంగి గుండ్లు దాదాపు నాలుగు వందల ఏళ్ల నాటివని స్థానిక ప్రజలు, అధికారులు తెలుపుతున్నారు. గండికోట జూమ్మా మసీదు వెనుక వైపు ఆయుధ కర్మాగారంగా ఉండేది. అందులో రాజులకు సంబంధించిన కత్తులతోపాటు, నాణేల ముద్రణ కోసం టంకశాల కూడా ఉండేదని చరిత్ర చెబుతుందంటూ స్థానికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పహారా మహాల్‌ వద్ద ఫిరంగి ఉండగా మరొకటి దక్షిణ వైపులో ఉంది.

ఇటీవల బయల్పడిన నీటి కుంట
శత్రువులు రాకుండా అడ్డుకట్ట వేయడం కోసం అప్పట్లో రాజులు కోటకు సంబంధించిన నాలుగు వైపులా బురుజులను ఏర్పాటు చేసి కొన్ని ప్రాంతాలలో ఫిరంగులను ఏర్పాటు చేస్తుండే వారు. ఆ ఫిరంగి గుండ్లను ఉక్కుతో తయారు చేసే వారు.  గతంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుని భూగర్భంలో కలిసిపోయినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా జుమ్మా మసీదు వెనుక వైపు ఉన్న వ్యాయామశాల (తాళింఖానా), ఆయుధ కర్మాగారాలకు సైతం అధికారులు మరమ్మతు పనులు చేపట్టాలని పర్యాటకులు కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు