చేపల వేటకు వెళ్లి.. బంధీలయ్యారు!

5 Oct, 2019 10:41 IST|Sakshi
బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరిస్తున్న మెరైన్‌ ఎస్‌ఐ తారక్‌

సముద్రమే వారి ప్రపంచం... చేపల వేటే వారి జీవనాధారం. ఉన్న ఊళ్లో ఉపాధి లేక సుదూర ప్రాంతానికి పయనం. గమ్యం తెలియని సంద్రంలో... ఏది మన దేశ మో... ఏది పరాయి దేశమో... తెలుసుకోలేని అమాయకత్వం. ఇదే వారి కొంప ముంచుతోంది. మొన్న శ్రీలంక... నిన్న పాకిస్తాన్‌... నేడు బంగ్లాదేశ్‌.. ఇలా ఏదో ఒక సరిహద్దు దేశంలోకి పొరపాటున చొరబడుతున్నారు. అక్కడి రక్షణశాఖలో బందీలుగా మారుతున్నారు. బతుకు తెరువుకోసం వెళ్లిన తమ వారు ఎప్పుడు ఏ చిక్కుల్లో పడతారో తెలియక ఇక్కడివారు నిరంతరం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బందీలైనవారు విడుదల కాక... మళ్లీ మరో ఎనిమిది మంది వేరే దేశంలో చిక్కుకోవడంతో తిప్పలవలసలో కుటుంబాలు కలవరపడుతున్నాయి.

సాక్షి, విజయనగరం : విజయనగరం జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు బంగ్లాదేశ్‌ జలాల్లో ప్రవేశించారు. ఈ విషయం తెలిసి ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దసరా పండగకు వస్తానని చెప్పి వెళ్లిన మత్స్యకారులు బందీలుగా చిక్కడంతో ఆ కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. వేటకు వెళ్లేటప్పుడు కుటుంబంతో సరదాగా గడిపి వెళ్లిన మత్స్యకారుల కుటుంబాలు తమవారు బందీలుగా చిక్కారని తెలియగానే ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు వస్తారో... అసలు వస్తారో రారో... తెలియక అల్లాడిపోతున్నారు. కనీసం తమవారితో అధికారులు ఫోన్‌లో మాట్లాడించేలా చూడాలని బోరున విలపిస్తున్నారు.  

బందీలుగా చిక్కినది ఇలా...
భారతదేశ సముద్ర జలాల్లో వేట కోసం తిప్పలవలసకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు వెళ్లారు.. పొరపాటున బంగ్లాదేశ్‌ సముద్ర జలాల్లోకి వెళ్లి చేపల వేట చేస్తుండగా  ఆ దేశ రక్షణ దళాలు అదుపులోకి 
తీసుకున్నాయి. విషయం గురువారం రాత్రి తెలియడంతో తిప్పలవలస గ్రామంలో అలజడి మొదలైంది. పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన మారుపల్లి పోలయ్య, రాయితి అప్పన్న, వాసుపల్లి అప్పన్న, మారుపల్లి నర్సింహులు, బర్రి రాము, వాసుపల్లి అప్పన్న, రాయితి రాములు, వాసుపల్లి కాములు విశాఖ హార్బర్‌ నుంచి ఎఫ్‌వీఎస్‌ఎం 800 నంబర్‌ బోటులో సెప్టెంబర్‌ 24వ తేదీన సముద్రంలో వేటకు వెళ్లారు. పొరపాటున వారు భారత సరిహద్దు దాటి బంగ్లాదేశ్‌ సముద్ర జలాల్లోకి ప్రవేశించడంతో ఈ నెల రెండో తేదీ సాయంత్రం నాలుగు గం టల సమయంలో వారిని బంగ్లా రక్షణ దళాలు పట్టుకున్నాయి. ఈ విషయాన్ని వారితోపాటే వేట చేస్తున్న మరికొందరు బోటు యజమాని వాసుపల్లి రాముకు సమాచారం ఇచ్చారు. 

నిత్య ప్రమాదం
ఉన్న ఊళ్లో వేటసాగక పోవడంతో ఇక్కడి మత్స్యకారులు వివిధ రాష్ట్రాల్లో చేపల వేటకు కూలీలుగా మారుతున్నారు. అలా వేటాడే సమయంలో ప్రకృతి ప్రకోపానికి బలై మరణశయ్యపైకి చేరుతున్నారు. కొన్ని ప్రమాదాల్లో మృతదేహాల ఆచూకీ కూడా లభ్యం కావట్లేదు. గతేడాది సెప్టెంబర్‌లో చింతపల్లికి చెందిన మైలపల్లి శ్రీను పారదీప్‌లో వేట చేసుకొని వస్తుండగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి తీరంలో జరిగిన పడవ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. పూసపాటిరేగ మండలం పతివాడ బర్రిపేటకు చెందిన సూరాడ రాము, వాసుపల్లి లక్ష్మణరావు, తమ్మయ్యపాలేనికి చెందిన బడే సత్తియ్య ఒడిశాలో గంజాం జిల్లా రామయ్యపట్నం రేవులో గల్లంతయ్యారు. ఇదే మండలం తిప్పలవలస, భోగాపురం మండలం ముక్కాంకు చెందిన కొంతమంది మత్స్యకారులు 2018 ఆగస్టు 15వ తేదీన గుజరాత్‌ రాష్ట్రంలోని వీరావల్‌కు వెళ్లారు. గతేడాది నవంబర్‌ 19వ తేదీన హార్బర్‌ నుంచి చేపల వేటకు బయలుదేరారు. నవంబర్‌ 29న పాకిస్థాన్‌ జలాల్లోకి ప్రవేశించడంతో అక్కడి కోస్ట్‌ గార్డ్‌ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ వారిలో తిప్పలవలసకు చెందిన నక్క అప్పన్న, బర్రి బవిరీడు, నక్కా నరిసింగు, నక్క దనరాజు, భోగాపురం మండలం ముక్కాంకు చెందిన మైలపల్లి గురువులు ఉన్నారు. వారెవ్వరూ ఇంకా విడుదల కాలేదు..

కుటుంబ సభ్యుల రోదనలు
బంగ్లాదేశ్‌లో బందీలుగా చిక్కిన తిప్పలవలసకు చెందిన వాసుపల్లి అప్పన్న ఇద్దరు భార్యలు మారుపల్లి తోటమ్మ, మారుపల్లి దానయ్యమ్మ విషయం తెలిసి బోరుమన్నారు. దసరా పండగకు వేట ముగించుకొని వస్తానని చెప్పి ఇంతలోనే బందీగా చిక్కావా అని కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన పాకిస్తాన్‌లో బందీలుగా చిక్కిన వారే ఏడాది కావస్తున్నా విడుదల కాలేదు. ఇక తమ వారి పరిస్థితి ఎమిటని గుండెలు బాదుకుంటున్నారు. బందీగా చిక్కిన వాసుపల్లి అప్పన్న తల్లి గురమ్మ రోదించిన తీరు అందరి హృదయాలను కలచివేసింది. 10 రోజుల్లో వేట ముగించుకుని వస్తామని చెప్పి ఇలా చిక్కుకోవడంతో ఆమె కలవరపడుతోంది. ఇంకా బర్రి రాము, వాసుపల్లి కాము, రాయితి రాము, వాసుపల్లి అప్పన్న, మారుపల్లి పోలయ్య, రాయితి అప్పన్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

విడుదల చేయించండి
బాధిత కుటుంబాలను మెరైన్‌ సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ తారక్, జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు బర్రి చినఅప్పన్న, పలువురు అధికారులు పరామర్శించారు. బందీలుగా వున్న మత్స్యకారులను తక్షణమే విడుదల చేయడానికి కేంద్రప్రభుత్వం స్పందించాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి 

మరిన్ని వార్తలు