స్వదేశానికి పయనమైన 8 మంది జాలర్లు

1 Feb, 2020 05:07 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఉత్తరాంధ్ర జాలర్లు

డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో బంగ్లా జైలులో 4 నెలలుగా మగ్గిన 63 మంది భారతదేశ మత్స్యకారులు (వీరిలో 8 మంది విజయనగరం జిల్లా, పూసపాటిరేగ, తిప్పలవలస గ్రామానికి చెందిన వారు) విడుదలైన సంగతి విదితమే. భాగర్‌హాట్‌ జైలు నుంచి బుధవారం విడుదలైన వారిని హైకమిషన్‌ ఆఫ్‌ ఇండియా, కుల్నా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రతినిధిగా హాజరైన వాసుపల్లి జానకీరామ్‌ కలిసి అక్కడి పోలీసుల సహకారంతో మత్స్యకారులను మొంగ్లా పోర్టుకు చేర్చారు. వీరిని ఐదు బోట్ల ద్వారా భారతదేశానికి పంపించాలి. కానీ, నాలుగు నెలలుగా మొంగ్లా పోర్టులో బోట్లు నిలిపివేశారు.

బోటులో ఉన్న ఐస్‌ కరిగిపోయి, వర్షపు నీరు ఇంజన్లలోకి ప్రవేశించడంతో బోట్లు మరమతులకు గురయ్యాయి. వీటి మరమతు అనంతరం శుక్రవారం పొద్దుపోయాక అమృత బోటులోనే స్వదేశానికి పయనమైనట్టు వాసుపల్లి జానకీరామ్‌ సాక్షికి తెలిపారు. స్వదేశానికి పయనమవుతున్న ఆనందంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటామంటూ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆదివారం నాటికి కోల్‌కతా ఫిషింగ్‌ హార్బర్‌కు చేరుకుంటారని, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధులు వీరిని హ్యాండోవర్‌ చేసుకుంటారని జానకీరామ్‌ తెలిపారు. 
 

>
మరిన్ని వార్తలు