చైల్డ్‌లైన్‌ అదుపులో 8 మంది చిన్నారులు

13 Jul, 2018 14:03 IST|Sakshi
చైల్డ్‌లైన్‌కు పిల్లలను అప్పగిస్తున్న ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది  

తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర) :  పలు ప్రాంతాల నుంచి తప్పిపోయి, పారిపోయి వచ్చిన 8మంది చిన్నారులను గురువారం ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో పట్టుకుని చైల్డ్‌ లైన్‌కు అప్పగించారు. చైల్డ్‌లైన్‌ సిబ్బంది తెలియజేసిన వివరాల ప్రకారం... పలాస, కాశీబుగ్గ నుంచి ఒక అమ్మాయి, అబ్బాయి(ఇద్దరు మైనర్లు) ప్రేమించుకుని, ఇంటి నుంచి పారిపోయి విశాఖపట్నం వచ్చేశారు. ఇక్కడి రైల్వేస్టేషన్‌లో మూడు రోజుల నుంచి ఉండడంతో జీఆర్పీ పోలీసులు గమనించి విచారించారు.

ముందు అబ్బాయి తండ్రికి బాగోకపోవడంతో కేజీహెచ్‌లో చేర్చామని, అందుకే ఇక్కడ ఉన్నామని చెప్పారు. అనంతరం పోలీసులు గట్టిగా అడగడంతో అసలు విషయం చెప్పారు. వీరి తల్లిదండ్రులు కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాలుడి తండ్రి తెలిపారు. సామర్లకోటకు చెందిన అశోక్‌(14) చదువు ఇష్టం లేక, మధ్యలోనే మానేసి ఇంటి దగ్గర ఉంటున్నాడు. అతని తండ్రి షాపులో పని నిమిత్తం పెట్టగా, పని చేయడం ఇష్టం లేక పారిపోయి వచ్చేశాడు. 

బిహార్‌కు చెందిన ఎండీ అఖిల్‌అంజుమ్‌(14), ఎండీ రిజ్వాన్‌(11)మదర్సాలో చేరేందుకు ఇంటి వద్ద చెప్పకుండా వచ్చేశారు. 13 సంవత్సరాల బాలుడు వాసు తన మామయ్యతో కలిసి రాజమండ్రికి హాస్టల్‌లో చేరేందుకు వెళ్తున్నట్లు... మామయ్య ట్రైన్‌ ఎక్కేయగా, తాను మిస్‌ అయినట్లు తెలియజేశాడు. విజయనగరం జిల్లా తెర్లాం ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు యం.ఈశ్వర్‌(12), యం.లక్ష్మణ్‌(10)చెన్నై వెళ్లిపోవాలని ఇంటి దగ్గర ఎవరికీ చెప్పకుండా విశాఖపట్నం వచ్చేశారు. 

వీరందరినీ అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రులకు సమాచారం అందించామని, వారంతా శుక్రవారం రానున్నట్లు చైల్డ్‌లైన్‌ సిబ్బంది తెలిపారు. సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు మెంబర్‌ శ్యామ్‌కుమార్‌ రైల్వేస్టేషన్‌కు చేరి పిల్లలందరికీ రక్షణ కల్పించేందుకు ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంచినట్లు చైల్డ్‌లైన్‌ కో ఆర్డినేటర్‌ జాన్‌పీటర్‌ తెలియజేశారు.

మరిన్ని వార్తలు