నేటి నుంచి అన్నీ ఓపెన్‌

8 Jun, 2020 03:24 IST|Sakshi

80 రోజుల తర్వాత తెరుచుకుంటున్న హోటళ్లు, మాల్స్, దేవాలయాలు

థియేటర్లు, బార్లు, బహిరంగ సభలు మాత్రం కుదరదు

మాస్కులు, భౌతిక దూరం,థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరి

నేటి నుంచి తిరుమలలో మూడ్రోజులపాటు ట్రయల్‌రన్‌

11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం

సాక్షి, అమరావతి: ఒకటి రెండు పరిమితులు తప్ప నేటి నుంచి రాష్ట్రంలో పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 23న లాక్‌డౌన్‌తో మొదలైన ఆంక్షలు ఒక్కొక్కటిగా సడలిస్తూ వచ్చిన ప్రభుత్వం.. జూన్‌ 8 సోమవారం నుంచి దేవాలయాలు, అన్ని మతాల ప్రార్థనా మందిరాలు, మాల్స్, హోటళ్లకూ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. వీటన్నిటిచోటా అందరూ మాస్క్‌ ధరించాలని.. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేసింది. దీంతో సినిమా థియేటర్లు, బార్లు, కళా ప్రదర్శనలు, ఆటలు, బహిరంగ సభలు వంటివి తప్ప మిగిలినవన్నీ ప్రారంభం కానున్నాయి. దీనికి అనుగుణంగా గత వారం రోజుల నుంచి లాడ్జిలు, స్టార్‌ హోటళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, మాల్స్‌ తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

ముఖ్యంగా రెస్టారెంట్లలో ప్రవేశ ద్వారం వద్దే శానిటైజేషన్‌ చేయడం, టేబుల్‌కు టేబుల్‌కు మధ్య దూరం ఉండే విధంగా చూడటం వంటి నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. విధులకు వచ్చే సిబ్బందితోపాటు వినియోగదారులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాలని.. జ్వరం, దగ్గు తదితర లక్షణాలతో వచ్చే వారి గురించి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి లేదా 104 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించింది. కాగా, ఏప్రిల్‌ 20 నుంచే ‘రీస్టార్ట్‌’ పేరుతో పరిశ్రమలు ప్రారంభించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత క్రమంగా షాపులకు.. ఇప్పుడు దేవాలయాలు, మాల్స్, హోటళ్లకు పచ్చజెండా ఊపింది. దీంతో పూర్తిస్థాయిలో వాణిజ్య లావాదేవీలు రాష్ట్రంలో మొదలైనట్లే.

80 రోజుల తర్వాత గుడిగంటలు
రాష్ట్రంలో 80రోజుల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం నుంచి దేవాలయాలు తెరుచుకోనున్నాయి. ఉ.6 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమ, మంగళవారాల్లో టీటీడీ సిబ్బందితో, బుధవారం తిరుమలలోని స్థానికులతో ట్రయల్‌ రన్‌ మొదలు పెట్టి, గురువారం (11వ తేదీ) నుంచి పూర్తిస్థాయిలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. అలాగే..

– రాష్ట్రవ్యాప్తంగా దేవదాయ శాఖ అధీనంలోని మిగిలిన అన్ని ఆలయాల్లోనూ సోమ, మంగళవారాల్లో ఆయా ఆలయాల సిబ్బంది, స్థానికులతో ట్రయల్‌ రన్‌ మొదలు పెట్టి, బుధవారం (10వ తేదీ) నుంచి పూర్తిస్థాయిలో భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. 

– అన్ని ఆలయాల వద్ద వద్ద టీటీడీ, దేవదాయ శాఖ కరోనా నియంత్రణకు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లుచేశాయి. 

– దర్శన సమయంలో భక్తులు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని ఇప్పటికే స్పష్టంచేశాయి. 
– ధర్మల్‌ స్క్రీనింగ్‌ అయ్యాకే భక్తులను లోపలికి అనుమతించనున్నారు. 

– ఆలయ మండపంలో ఎప్పుడూ 30 మంది భక్తులు మించకుండా ఉంచుతూ, గంటకు 300  మందికి మాత్రమే దర్శనం అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. 

మరిన్ని వార్తలు