తిరుపతి–తిరుమల మధ్య 80 ఎలక్ట్రికల్‌ బస్సులు

19 Feb, 2019 12:33 IST|Sakshi
తిరుపతి బస్‌ స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న ఎండీ సురేంద్రబాబు, వివరాలను ఎండీకి తెలియజేస్తున్న ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి, ఏటీయం గోపినాథ్‌

నష్టాలకు కార్మికులుబాధ్యులు కారు

బస్సు పోర్టు ఏర్పాటుకు 15 ఎకరాలు

ఉద్యోగ విరమణ రోజే అన్నీ చెల్లింపులు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు

చిత్తూరు , తిరుపతి సిటీ: రెండు నెలల్లో తిరుపతి–తిరుమల మధ్య 80 ఎలక్ట్రికల్‌ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు వెల్లడించారు. సోమవారం తిరుపతి ఆర్‌ఎం కార్యాలయంలో రీజియన్‌లోని డిపో మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు, ఇతర అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ముందుగా డిపోల వారీగా దృశ్యమాధ్యమంతో ఆయన సమీక్షించారు. సంస్థలో పనిచేసి ఉద్యోగవిరమణ పొందిన రోజునే అన్ని బెనిఫిట్స్‌ చెల్లించాలని సూచించారు. కార్మికులు తరచూ ప్రమాదాలకు గురిచేస్తున్నా, పనిష్‌మెంట్లకు గురవుతున్నా అలాంటి వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు.  ఆర్టీసీలో నష్టాలకు కార్మికులు ఏమాత్రం బాధ్యులు కారని, పెరుగుతున్న డీజిల్‌ ధరలే కారణమని చెప్పారు. రీజియన్‌ పరిధిలో నష్టాలను తగ్గించుకునే దిశగా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. తిరుపతి–తిరుమల మధ్య ఎలక్ట్రికల్‌ బస్సులు నడిపేందుకు టెండర్లు ఆహ్వానించామన్నారు.

ఈ బస్సులు నడపటం వల్ల వాతావారణం కాలుష్యం ఉండదన్నారు.  రానున్న రోజుల్లో అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.   తిరుపతిలో బస్సు పోర్టు నిర్మాణానికి ఉచితంగా 15 ఎకరాలు స్థలం కోసం జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ హైవేస్‌ (దిల్లీ) సాయంతో మోడరన్‌ బస్సు పోర్టును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలో అలిపిరి వద్ద కార్మికులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు రీజినల్‌ హాస్పిటల్‌ నిర్మాణపు పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. బస్సు డిపోల్లో, బస్‌ స్టేషన్లలో సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో ఈడీ (ఆపరేషన్స్‌) జయరావు, ఈడీ (ఇంజినీరింగ్‌) రామకృష్ణ, నెల్లూరు జోన్‌ ఈడీ వెంకటేశ్వరావు, డిప్యూటీ సీటీఎంలు రాము, మధుసూదన్, సీఎంఈలు శ్రీనివాసరావు, నరసింహులు, డిపో మేనేజర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు