నేలరాలుతున్న పసికందులు

28 Jul, 2014 00:49 IST|Sakshi
నేలరాలుతున్న పసికందులు

ఏటా 80వేల మంది శిశువుల మృతి  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌పై యునిసెఫ్ నివేదిక
 
హైదరాబాద్: వైద్య విజ్ఞానం అంతకంతకూ పెరుగుతున్నా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శిశువుల మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి తోడు వైద్య సిబ్బందికి సరైన శిక్షణ లేకపోవడంవల్ల తల్లులకు గర్భశోకాన్ని మిగుల్చుతోంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, శిశు మరణాలను నియంత్రించడంలో ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) ఘోరంగా విఫలమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏటా 80 వేల మందికి పైగా శిశువులు మరణిస్తున్నట్టు యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి భారతదేశంలో 35 రాష్ట్రాలుంటే అందులో శిశు మరణాల నియంత్రణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 26వ స్థానంలో ఉందంటే రాష్ట్రంలో శిశు మరణాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందికీ 49 మంది శిశువులు వివిధ కారణాల వల్ల ఏడాదిలోపే మరణిస్తున్నారు. వీరిలోనూ 33 మంది నెలలోపే మృతి చెందుతున్నారు.

ఎక్కువమంది తక్కువ బరువుతో జన్మించడం వల్ల మరణిస్తున్నట్లు యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. నిమోనియా, పుట్టుకతోనే వచ్చే లోపాలు, కామెర్లు తదితర కారణాలూ నవజాత శిశువుల మరణాలకు కారణాలవుతున్నాయని తెలిపింది. శిశు మరణాలకు ప్రధాన కారణంగా రాష్ట్రంలో ప్రసూతి కేంద్రాలు అధ్వానంగా ఉండటమేనని తేల్చింది. శిశువులను కాపాడగలిగిన వైద్య పరికరాలు, అత్యాధునిక వైద్యం అందుబాటులో లేవని తెలిపింది. ఆస్పత్రుల సామర్థ్యానికి మించి శిశువులు వైద్యానికి వస్తున్నారని, వారికి తగిన వసతులు ఉండటంలేదని పేర్కొంది. ఉదాహరణకు నీలోఫర్ ఆస్పత్రిలో 500 పడకలు ఉంటే రోజూ వెయ్యి మంది ఇన్‌పేషెంట్లుగా వస్తున్నారు.
యూనిసెఫ్ పేర్కొన్న కారణాలు.

రాష్ట్రంలో పీడియాట్రిక్ (చిన్న పిల్లల) వైద్యుల కొరత ఎక్కువగా ఉండటం
ఎక్కువ మంది వైద్యులు డిప్లొమా ఇన్ పీడియాట్రిక్ వారే కావడం వల్ల చాలా వ్యాధులను గుర్తించలేకపోవడం
నవజాత శిశువులకు వైద్య సేవలందించి, వారిని కాపాడటానికి సరైన శిక్షణ పొందిన వైద్యులు, నర్సులు లేకపోవడం
కొన్ని చోట్ల ఆధునిక వైద్య పరికరాలున్నా, వాటిని వాడే విధానం తెలియకపోవడం
లేబర్ రూమ్‌లు (ప్రసూతి కేంద్రం) సరిగా లేక 70 శాతం మంది నవజాత శిశువులకు ఇన్ఫెక్షన్‌లు సోకడం
{పసవ సమయంలో ఆస్పత్రికి వచ్చేందుకు రవాణాలో జాప్యం కావడం

పుట్టగానే కామెర్లు, శ్వాసకోశ వ్యాధులు తదితర వాటి నుంచి కాపాడేందుకు అవసరమైన ఫొటోథెరపీ మెషీన్లు, నెబ్యులైజర్లు, ఇంక్యుబేటర్లు లేకపోవడం
 
రూ.500 కోట్లు ఖర్చు చేసినా..


రాష్ట్రంలో శిశు మరణాల నియంత్రణకు గత నాలుగేళ్లలో సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం. మాతా శిశు మరణాల నియంత్రణకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ పేరిట 21 కేంద్రాలను ఎంపిక చేశారు. వీటికి సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేశారు. తీరా చూస్తే వీటిలో డాక్టర్లు లేరు. మెరుగైన ప్రసూతి వైద్య సేవలు అందించాలని సీమాంక్ సెంటర్ల పేరిట సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేశారు. అయినా శిశు మరణాలు తగ్గలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రసూతి సౌకర్యాల కోసం 300 సీహెచ్‌సీలు (సామాజిక ఆరోగ్య కేంద్రాలు) ఏర్పాటు చేస్తే 90 శాతం ఆస్పత్రుల్లో వైద్యులు లేరు. రాష్ట్రంలో కనీసం 350 మంది శిక్షణ పొందిన పీడియాట్రిక్ వైద్యుల అవసరం ఉంటే.. ప్రస్తుతం 50 మంది కూడా లేరు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పథకం నిధులతో ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు కొనుగోలు చేస్తున్న వైద్య పరికరాలు అధికారులు, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి తప్ప శిశు మరణాలను ఆపలేకపోతున్నాయి.
 
శిశు మరణాలను అరికట్టండి: మంత్రి శ్రీనివాస్

రాష్ట్రంలో శిశు మరణాలను అరికట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శిశు మరణాలు జరగకుండా గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖలో ఆదేశించారు. మాతా శిశుమరణాల నివారణకు అవసరమైన వైద్యులను నియమించాలని చెప్పారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు సరిగా పనిచేయడంలేదని, వీటిపై దృష్టి సారించాలని సూచించారు. ప్రధాన ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించి మెరుగైన సేవలు అందించాలన్నారు.
 
 

మరిన్ని వార్తలు