ఎంసెట్ కౌన్సెలింగ్‌లో 81,808 ఆప్షన్లు

23 Jun, 2015 23:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఆప్షన్లలో మార్పు చివరి గడువు మంగళవారంతో ముగిసింది. ఎంసెట్‌లో అర్హత సాధించి ధ్రువపత్రాలు పరిశీలింపచేసుకున్న 81,972 మందిలో 81,808 మంది ఎంసెట్ కోర్సులకు ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. బుధవారం ఉదయం పది గంటలవరకు ఆప్షన్లు మార్చుకొనే అవకాశమున్నందున మొత్తం ధ్రువపత్రాలు సమర్పించుకున్న వారంతా ఆప్షన్లు ఇచ్చుకొనే అవకాశముంది. గతంతో పోలిస్తే ఈసారి ఆప్షన్లు ఇచ్చుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం.

నేటినుంచి పాలిసెట్ వెబ్ ఆప్షన్లు
ఇలా ఉండగా పాలిసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేయనున్నారు. సోమ, మంగళవారాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు రావలసిన 25వేల మందికి గాను 15వేల మంది హాజరయ్యారని అధికారవర్గాలు వివరించాయి. ఈనెల 28వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఆ పై వెబ్ ఆప్షన్ల నమోదు, ఆప్షన్ల మార్పుల అనంతరం జులై 3వ తేదీన సీట్ల అలాట్‌మెంటు జరుగుతుందని పాలిసెట్ చీఫ్ క్యాంప్ ఆఫీసర్ రఘునాధ్ తెలిపారు.

మరిన్ని వార్తలు