తూలేవాడిని నిలబెట్టింది!

30 Jun, 2020 04:58 IST|Sakshi

మద్య నియంత్రణతో జీవితాల్లో నవోదయం

కళ్లెదుటే కనిపిస్తున్న మార్పులు

వైఎస్సార్‌ జిల్లాలో ఏడాదిలో 82 దుకాణాల తొలగింపు

సాక్షి కడప: మందుబాబులకు మద్యం బరువుగా, భారంగా మారుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరుతోంది. అక్క చెల్లెమ్మల జీవితాల్లో కష్టాలు తొలగి వెలుగు రేఖలు ప్రసరిస్తున్నాయి. ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం కఠినంగా మద్య నియంత్రణ చర్యలను అమలు చేస్తుండటంతో మార్పు కళ్ల ముందే కనిపిస్తోంది. టీడీపీ హయాంలో వైఎస్సార్‌ జిల్లాలో 1,200కిపైగా బెల్ట్‌ షాపులు ఉండగా ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్మూలించింది. ఇక టీడీపీ హయాంలో జిల్లాలో 255 మద్యం దుకాణాలు ఉండగా ప్రస్తుతం 173కి కుదించారు. ధరలు భారీగా పెంచడం, విక్రయ వేళలను తగ్గించడం, దుకాణాల కుదింపుతో చాలామంది మద్యానికి దూరంగా ఉంటున్నారు. 

సాధారణంగా అయితే ఆపను..
‘నాకు 15 ఏళ్లుగా మద్యం అలవాటు ఉంది. రోజూ తాగనిదే నిద్ర పట్టేది కాదు. నాకు భార్య,  ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటిసారి మద్యం ధరలు పెంచినప్పుడు గతేడాదే మానేద్దామనుకున్నా. ఇటీవల మరోసారి రేట్లు పెంచడంతో అనవసరంగా డబ్బులు తగలేయడం తప్ప ఒరిగేదేమీ లేదని పూర్తిగా మానేశా. ఇక ఎప్పుడూ మద్యాన్ని ముట్టను. సాధారణంగా అయితే మద్యాన్ని మానుకునేవాడిని కాదు. సీఎం జగన్‌ సార్‌కు కృతజ్ఞతలు’
– ఎస్‌.సిరాజ్‌ఖాన్‌ (జమాల్‌పల్లె, సీకే దిన్నె మండలం, కమలాపురం నియోజకవర్గం)

ఎక్కడబడితే అక్కడ పడేవాడ్ని..
‘కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తా. నాకు పదేళ్లకు పైగా మద్యం అలవాటు ఉంది. కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా తిరిగేవాడిని. తాగిన మత్తులో ఎక్కడంటే అక్కడ పడిపోయేవాడిని. పిల్లల ఛీత్కారా లతోపాటు మద్యం ధరలు పెరగడంతో తాగుడంటే విరక్తి చెంది మారిపోయా. నాలుగు నెలలుగా మందు జోలికి వెళ్లడం లేదు. కలహాలు లేకుండా కుటుంబంతో ఆనందంగా ఉన్నా. మద్యానికి వెచ్చించే డబ్బులతో పిల్లలకు పండ్లు, చిరుతిండ్లు తెచ్చి ఇస్తున్నా. వారి కళ్లల్లో ఆనందం చూసి ఇక జీవితంలో తాగకూడదని నిర్ణయిం చుకున్నా. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు’
– ఎస్‌.హరిబాబు (కడప)

సానా వరకు తాగటం తగ్గింది...
‘రాజంపేట సబ్‌స్టేషన్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నా. కూలి పనులకు కూడా వెళతా. రాత్రి మందు పడితేగానీ పొద్దున పనికి వెళ్లేవాడిని కాదు. కరోనా కారణంగా దాదాపు రెండు నెðలలు మందు దొరక లేదు. మళ్లీ షాపులు తెరిచాక రెండు రోజులు తాగా. గతంలో రూ.200–250 మాత్రమే అయ్యే మద్యం ఖర్చు ఇప్పుడు రూ.600 వరకు అవుతోంది. లాక్‌డౌన్‌ లో మందు లేకుండా ఉండగలిగినప్పుడు ఇప్పుడు ఎందుకు ఉండలేననే పట్టుదలతో మందు మానేశా. పనులు లేనప్పుడు ఇంటివద్దే మనవళ్లు, మనవరాళ్లను ఆడిస్తూ సంతోషంగా ఉన్నా. మా ఊళ్లో మందు తాగే టోళ్లంతా సానా వరకు తాగడం తగ్గించినారు. సీఎం జగన్‌ మంచి పనే చేశారు. మిగతా షాపులు కూడా ఎత్తేస్తే అందరికి నాలుగు డబ్బులు మిగులుతాయి’
– గొంటు సుబ్బన్న (కొమ్మివారిపల్లె, రాజంపేట మండలం)

మత్తు వదిలింది...!
‘భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ రోజుకు రూ.500 దాకా సంపాదిస్తా. భార్యతోపాటు ఇద్దరు కుమారులున్నారు. మద్యం మత్తుతో ఒళ్లు నొప్పులు తెలియవని దీర్ఘకాలంగా తాగుడు వ్యసనానికి బానిసనయ్యా. నిత్యం రూ.150 వరకు తాగుడుకు ఖర్చయ్యేది. లాక్‌డౌన్‌ వల్ల చాలా రోజులు మద్యానికి దూరమయ్యా. ఇప్పుడు మద్యం రేట్లు పెరగడంతో తాగుడు మానుకున్నా. ఇప్పుడు ఆరోగ్యం కూడా బాగుంది. అంతా కలసి భోజనం చేయడం, పిల్లలతో గడపడం ఆనందాన్ని ఇస్తోంది. మద్యం మత్తు నుంచి బయటపడటం చాలా సంతోషంగా ఉంది’
– మద్దెల సుధాకర్‌ (సిద్దవటం, రాజంపేట నియోజకవర్గం)

మరిన్ని వార్తలు