నిర్మాణ దశలో 90 భారీ పరిశ్రమలు

6 Nov, 2013 02:55 IST|Sakshi

 నక్కపల్లి, న్యూస్‌లైన్:
 జిల్లాలో రూ.75 వేల కోట్లతో 90 భారీ పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయని జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ లక్ష్మణ్ తెలిపారు. ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద నమోదు చేయించుకుని వివిధ దశల్లో ఉన్న ఈ పరిశ్రమల పూర్తికి నాలుగేళ్ల సమయం పడుతుందన్నారు. నిర్మాణ దశలో ఉన్న సంస్థల్లో ఎక్కువగా ఫార్మా, ఫెర్రో అల్లాయీస్ తదితర సంస్థలు ఉన్నాయన్నారు. ఈ సంస్థలు నిర్మాణం పూర్తయి ఉత్పత్తులు ప్రారంభిస్తే సుమారు 50 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సుమారు రూ.100 కోట్ల వ్యయంతో 200 వరకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా నిర్మాణ దశలోనే ఉన్నాయన్నారు. ఇప్పటివరకు నిరుద్యోగులకు భీమిలి, ఆటోనగర్‌లతో సదస్సులు నిర్వహించామని, బుధవారం నర్సీపట్నంలో సదస్సు జరగనుందని తెలిపారు.
 
 స్వయం ఉపాధిపై దృష్టి సారించాలి
 నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నిరీక్షించి సమయాన్ని వృథా చేసేకన్నా స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ లక్ష్మణ్ హితవు పలికారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌రాయవరం, కోటవురట్ల మండలాల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సలహాలు సూచనలు, ఏ పరిశ్రమ ఏర్పాటు చేస్తే లాభదాయకంగా ఉంటుందో సూచనలు, ప్రాజెక్టు రిపోర్టులు అందించేందుకు ప్రతి జిల్లాలో పరిశ్రమల కేంద్రం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాక నిధులకు కొరత లేదని, దళిత పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. సదస్సులో డీడీ గిరిధర్, ఎంపీడీవో కృష్ణ, ఈవోఆర్‌డీ పి.ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 

మరిన్ని వార్తలు