‘పెండింగ్‌’ పరేషాన్‌ !

2 Sep, 2018 06:45 IST|Sakshi

ఇప్పటివరకు వీఎంసీపై వివిధ కోర్టుల్లో 904 కేసులు పెండింగ్‌

అన్ని కోర్టుల్లో కలిపి 433 కేసులతో ‘టౌన్‌ప్లానింగ్‌’ టాప్‌

‘రెవెన్యూ’పై 237 కేసులు పెండింగ్‌ 

నగరపాలక సంస్థ పరిపాలన పరంగా, పన్నుల వసూళ్ల పరంగా, అనుమతులు, లీజుల వ్యవహారంలో నెలకొన్న వివాదాలపై ఇటీవల న్యాయ సమస్యలు చుట్టుముడుతున్నాయి. హైకోర్టు, స్థానిక కోర్టులు, ట్రిబ్యునల్‌ కేసుల తాకిడి నానాటికీ పెరుగుతుంది. వీఎంసీ ఒంటెత్తు పోకడ వల్లే కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయని, వీటి  పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు కూడా శూన్యమని విశ్లేషకులు పేర్కొంటున్నారు... 

సాక్షి, అమరావతి బ్యూరో: అధికారుల అవగాహన లోపం.. పాలనపరంగా నెలకొన్న లొసుగులు.. అధికారుల ఏకపక్షతీరుతో ఎదుర్కొంటున్న ట్రిబ్యునల్‌ కేసులు ఇప్పుడు నగర పాలక సంస్థకు గుదిబండగా మారాయి. పిటిషనర్లు దాఖలు చేసిన అర్జీలు, ఫిర్యాదులపై సకాలంలో చర్యలు తీసుకోకపోవటం, రూల్స్‌ అమలు చేసే విధానంలో ఏకపక్షంగా వ్యవహరించటం, రికార్డుల నిర్వాహణలో లోపాలు, చట్టం నిర్ధేశించిన పద్ధతి కాదని అధికారులు తమ ఇష్టానుసారం వ్యవహరించటం వంటి కారణాలతో ఇప్పుడు నగరపాలక సంస్థ ఆయా కోర్టుల్లో 904 కేసులు ఎదుర్కొంటుంది.
 దీనికి సంబంధించి లీగల్‌సెల్‌ ప్రత్యేక విభాగం ఉన్నప్పటికీ ఆయా కేసులకు సంబంధించిన వివరాలను సంబంధిత విభాగ అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవటం, నివేదికలు అందించకపోవటం, రికార్డులు పంపిణీ చేయటంలో విఫలమవ్వడంతో కేసులు ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్నాయని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికారులు నిబంధనలను అమలు చేయటంలో విఫలమవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. న్యాయ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నచోట స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తే కేసును కోర్టువరకు కాకుండా మధ్యవర్తుల వద్దే పరిష్కరించుకునే వెసులుబాటు ఉన్నా, అధికారులు తమ ఇష్టానుసారం వ్యవహరించి కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తున్నారని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఆయా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల వల్ల కార్పొరేషన్‌కు సమకూరాల్సిన ఆదాయం కూడా కోల్పోవాల్సి వస్తుందని ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు. 

టౌన్‌ప్లానింగ్‌ నుంచే అత్యధికం..
వీఎంసీలో అత్యధికంగా టౌన్‌ ప్లానింగ్‌ విభాగం నుంచే కేసులు అధికంగా దాఖలవుతున్నాయి. భవన నిర్మాణాలకు సంబంధించి అనుమతుల్లో జాప్యం, అక్రమకట్టడాలు, అక్రమ కట్టడాల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులు స్వీకరించటంలో విఫలమవ్వడం, రోడ్డు విస్తరణలు, మాస్టర్‌ప్లాన్‌ అమలు, ఆక్రమణలు క్రమబద్ధీకరణ వంటి కారణాలతో వీఎంసీ న్యాయ సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ విభాగంపై రాష్ట్ర హైకోర్టులో 327 కేసులు, ఏపీ ట్రిబ్యునల్‌లో ఒకటి, స్థానిక కోర్టుల్లో 105 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రెవెన్యూ విభాగంలో ఖాళీ స్థలాలకు పన్నులు వేసే సమయంలో జాగ్రత్తలు పాటింకచకోవటం, రాయితీలు, ఆస్తిపన్నుల వ్యవహారంలో జోన్‌ కేటగిరీల్లో మార్పులు, రాయితీల వ్యవహరంలో నిర్లక్ష్యంగా ఉండటం తదితర కారణాలతో హైకోర్టులో 208 కేసులు నమోదయ్యాయి, స్థానిక కోర్టుల్లో 29 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నగరపాలక సంస్థ ఆస్తుల పరిరక్షణ, లీజులు, అద్దెలు, లీజుల పునరుద్ధరణ తదితర అంశాలకు సంబంధించి హైకోర్టులో 51 కేసులు, స్థానిక కోర్టులో 27 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 

ఇంజినీరింగ్‌ విభాగంలో వివిధ రకాల నిర్మాణాల సమయంలో స్థల యజమాన్యాల హక్కుల వివాదం, సౌకర్యాల కల్పనలో వివాదాలు, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తదితర కారణాలతో హైకోర్టులో 48 కేసులు, స్థానిక కోర్టులో 7 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రజారోగ్య విభాగంలో శానిటేషన్‌ కాల్వల నిర్వాహణపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు పరిష్కరించకపోవటం, డీఅండ్‌ఓ ట్రేడ్‌లైసెన్స్‌లు ఇచ్చే వివాదంలో కేసులు, న్యూసెన్స్, పొల్యూషన్, ఆరోగ్యపరమైన అంశాల్లో హైకోర్టులో 54 కేసులు, ఏపీ ట్రిబ్యునల్‌ల్లో ఒకకేసు, స్థానిక కోర్టులో 5 కేసులు పెండింగ్‌లో ఉన్నాయ. అడ్మినిస్ట్రేషన్‌–ఎడ్యుకేషన్‌ విభాగంలో ఉద్యోగులు, అధికారులు ఉద్యోగపరమైన సమస్యలు, సీనియారిటీ, ప్రమోషన్లు, క్రమ శిక్షణ చర్యలు వంటి వాటిపై సిబ్బంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. వీటిపై హైకోర్టులో 14 కేసులు ఉండగా, ట్రిబ్యునల్‌లో ఆరు కేసులు, స్థానిక కోర్టులో నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితోపాటు ఇతర కేసులు 9 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 

లీగల్‌సెల్‌పై సమీక్ష 
పటమట(విజయవాడ తూర్పు): నగర పాలక సంస్థపై వివిధ విభాగాల అధికారులను సమన్వయపరచి కేసుల పరిష్కరించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నగర మేయర్‌ కోనేరు శ్రీధర్‌ అన్నారు. శనివారం వీఎంసీ కౌన్సిల్‌ హాల్లో లీగల్‌సెల్‌పై సమీక్ష సమావేశం జరిగింది. కార్యక్రమంలో నగరపాలక సంస్థపై దీర్ఘకాలికంగా ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు అధికారులు, ఎంఎస్‌సీలు కలిసి సమన్వయంతో పనిచేయాలని మేయర్‌ సూచించారు. కార్పొరేటర్లు పలు సూచనలు చేశారు. 

మరిన్ని వార్తలు