ఎనిమిది నెలల్లో 913 మరణాలు

6 Sep, 2015 04:04 IST|Sakshi
ఎనిమిది నెలల్లో 913 మరణాలు

సాక్షి, గుంటూరు : నవ్యాంధ్రప్రదేశ్‌లో ఆరుజిల్లాలకు ఆరోగ్య ప్రదాయనిగా చెప్పుకొనే జీజీహెచ్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వైద్యపరికరాలు, కనీస వసతులకు సైతం నిధులు మం జూరు చేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జీజీహెచ్‌లోని ప్రసూతి, శిశు వైద్య విభాగాలకు అనేక జిల్లాలనుంచి రో గులు చికిత్స నిమిత్తం వ స్తుంటారు. ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, సి బ్బంది కొరతతో వీరిని పట్టించుకునే దిక్కేలేకుం డా పోతుంది. శిశుశస్త్ర చికిత్సా విభాగంలో ఈ నెల 26వ తేదీన మూషికాల దాడిలో మృతి చెందిన శిశువు ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

 సరిపడా లేని సదుపాయాలు
 ఈ రెండు విభాగాల్లో ఇన్‌పేషెంట్లు అధికంగా చేరుతుండటంతో బెడ్లు సైతం సరిపోక ఒక్కో బెడ్‌పై ఇద్దరు బాలింతలు, ఇద్దరు పసిపిల్లలు చొప్పున పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇక పిల్లల వైద్య విభాగంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నవజాత శిశువుల సంరక్షణ కేంద్రంలో (ఎస్‌ఎన్‌సీయూ) కామెర్లు, బరువు తక్కువ పిల్లలను వార్మర్లు, ఫొటోథెరఫీ యూనిట్‌లో పెట్టి వైద్యసేవలు అందిస్తారు. ఒక పసికందును ఉంచాల్సిన వార్మర్, ఫొటోథెరపీ యూనిట్‌లో ఐదుగురు చొప్పున ఉంచుతున్నారు.

ఇలా చేయడం వల్ల ఒక శిశువు నుంచి మరొక శిశువుకు ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలమంది వచ్చే ఈ విభాగంలో కేవలం పది వార్మర్లు, పది ఫొటోథెర ఫి యూనిట్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఈ పిల్లలకు ప్రాణాపాయ స్థితి వస్తేవారి ప్రాణాలు రక్షించేందుకు అవసరమైన వెంటిలేటర్ ఒక్కటి కూడా ఈ విభాగంలో లేకపోవడం దారుణైం. ఎన్‌ఐసీయూలో సైతం దాదాపు ఇదే పరిస్థితి నెలకొని ఉంది.

 ఎనిమిది నెలల్లో 913 మంది పసికందుల మృతి..
 జీజీహెచ్‌లోని శిశు వైద్య విభాగంలో ఈఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు ఏడునెలల వ్యవధిలో 913 మంది చిన్నారులు మృతిచెందారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇందులో నవజాత శిశువుల సంరక్షణ కేంద్రంలో (ఎస్‌ఎన్‌సీయూ)లో ఈ ఏడాది ఎనిమిది నెలల్లో మొత్తం 2,189 మంది పసికందులు వైద్యం కోసం చేరగా అందులో 737 మంది మృత్యువాత పడ్డారు. చిన్నపిల్లల అత్యవసర విభాగంలో మొత్తం 649 మంది చిన్నారులు చేరగా అందులో 176 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన చిన్నారుల్లో 32 శాతం మంది మృత్యు ఒడిలోకి జారుకుంటున్నారు.

 చివరి దశలో వస్తుండటం వల్లే..
 జీజీహెచ్ శిశువైద్య విభాగంలో ప్రతి వంద మందిలో 30 మంది మృతి చెందుతున్న విషయం వాస్తవమే. ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్న పసికందుల్లో అధికశాతం మంది ప్రాణాపాయ స్థితిలో వస్తున్నారు. జీజీహెచ్‌లో కాన్పు అయిన చిన్నారుల్లో మరణాల శాతం తక్కువ. ప్రైవేటు ఆసుపత్రుల్లో కాన్పు జరిగి నెలలు నిండకముందే ప్రసావాలు జరుగుతున్న పసికందులను సీరియస్ కండిషన్‌లో జీజీహెచ్‌కు తీసుకువస్తున్నారు. వీరిలోనే మరణాలశాతం అధికంగా ఉంటుంది. దీనికితోడు పిల్లల విభాగంలో 60 మంది నర్సులకు గాను ఎనిమిదిమంది మాత్రమే ఉన్నారు. దీంతో పిల్లల పర్యవేక్షణ కష్టతరమౌతుంది.  
- డాక్టర్ యశోధర,శిశు వైద్య విభాగాధిపతి

మరిన్ని వార్తలు