బ్యాంకుకు టోకరా వేసిన మంత్రిగారి బంధువు

26 Sep, 2017 11:29 IST|Sakshi

జమ్మలమడుగు టౌన్‌ బ్యాంకును ముంచేసిన మంత్రి ఆది బంధువర్గం

సుమారు రూ.2 కోట్లకు టోకరా

మంత్రి బంధువు చైర్మన్, అన్న గౌరవాధ్యక్షుడు, తమ్ముడు డైరెక్టర్, బావ వైస్‌ చైర్మన్

‘సాక్షి’ కథనాలతో విచారణ.. అక్రమాలు నిజమేనని నిర్ధారణ

సాక్షి ప్రతినిధి, కడప: సహకార శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులే పాలక వర్గంగా వ్యవహరిస్తున్న వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (టౌన్‌ బ్యాంకు)లో రూ.2 కోట్ల భారీ కుంభకోణం బట్టబయలైంది. చైర్మన్‌ హృషి కేశవరెడ్డి, సీఈవో బాలాజీ ఈ సొమ్మును స్వాహా చేయడంతో బ్యాంకు మూతపడే పరిస్థితి వచ్చిందని ఈ నెల 22, 23వ తేదీల్లో ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో అధికారులు విచారణ జరిపి అక్రమాలు నిజమేనని తేల్చారు. హృషికేశవరెడ్డి మీద సోమవారం పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు ఆయన ఆస్తులు, బ్యాంకు అకౌంట్లను అటాచ్‌  చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాలకవర్గాన్ని రద్దు చేసి, జమ్మలమడుగు డివిజనల్‌ కో ఆపరేటివ్‌ అధికారి సుబ్బరాయుడును ప్రత్యేకాధికారిగా నియమించారు.

జమ్మలమడుగు కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకోవడంతో పాటు, రుణాలు మంజూరు చేస్తూ వ్యాపారం చేసింది. సహకార చట్టం కింద నడుస్తున్న ఈ సొసైటీ యాక్సిస్‌ బ్యాంకులో ఖాతా తెరచి తమ బ్యాంకుకు వచ్చే మొత్తాన్ని అందులో జమ చేసి లావాదేవాలు జరిపింది. మంత్రి ఆదినారాయణరెడ్డి బంధువు తాతిరెడ్డి హృషి కేశవరెడ్డి ఈ సొసైటీ పాలక వర్గానికి చైర్మన్‌గా, మంత్రి సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి గౌరవాధ్యక్షుడిగా, మంత్రి తమ్ముడు శివనాథరెడ్డి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మంత్రి బావ, జమ్మలమడుగు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తులసి భర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు. మంత్రి కుటుంబం, బంధువర్గం ఆధీనంలో నడుస్తున్న ఈ బ్యాంకులో ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు దాకా రూ.2 కోట్లు పక్క దారి పట్టాయి. వ్యాపారులు కట్టిన సొమ్మును యాక్సిస్‌ బ్యాంకులో జమ చేయకుండా చైర్మన్‌ హృషి కేశవరెడ్డి తన సొంత అవసరాలకు వాడుకున్నారు.

హృషికేశవరెడ్డిపై కేసు.. ఆస్తుల అటాచ్‌కు ఆదేశం
రూ.1.41 కోట్లు కాజేశాడనేందుకు ఆధారాలు లభించడంతో చైర్మన్‌ హృషి కేశవరెడ్డిపై సోమవారం డివిజనల్‌ కో ఆపరేటివ్‌ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సహకార చట్టంలోని సెక్షన్‌ 73 కింద ఆయన ఆస్తులు, బ్యాంకు ఖాతాలు అటాచ్‌ చేయాలని జిల్లా సహకార శాఖాధికారి స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు సెక్షన్‌ 51 కింద లోతైన దర్యాప్తు జరపాలని డీసీవో ఉత్తర్వులు జారీ చేశారు. క్రెడిట్‌ సొసైటీ పాలక వర్గాన్ని రద్దు చేసి జమ్మల మడుగు డివిజనల్‌ కో ఆపరేటివ్‌ అధికారి సుబ్బరాయుడును ప్రత్యేకాధికారిగా నియమించారు. కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీకి చెందిన రూ.1.41 కోట్లు తనకు చేరినట్లు, మరో రూ.54 లక్షలు సొంతానికి వాడుకున్నట్లు చైర్మన్‌ హృషి కేశవరెడ్డి విచారణ అధికారుల ఎదుట ఒప్పుకున్నారు. రూ.5 లక్షలు వాడుకున్నట్లు సొసైటీ సీఈవో బాలాజీ వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాము కష్టపడి దాచుకున్న సొమ్ము తిరిగి ఇచ్చేయాలని బాధితులు చైర్మన్‌ హృషి కేశవరెడ్డిని కలసి కోరారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వియ్యంకుడు, విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి తనకు రూ.కోటి ఇవ్వాలని, ఆయన ఆ సొమ్ము తనకిస్తే ఈ బాకీ తీరుస్తానని చెబుతున్నారని వారు గగ్గోలు పెడుతున్నారు. విద్యా సంస్థల కేశవరెడ్డి బాకీతో తమకు సంబంధం ఏమిటని, తమ సొమ్ము వెంటనే తమకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు