రహ‘దారులు’ తప్పాయి!

26 Sep, 2017 03:22 IST|Sakshi
రాజధాని పరిధిలోని తుళ్లూరు సమీపంలో నిలిచిపోయిన సీడ్‌ యాక్సిస్‌ రోడ్ల పనులు

రాజధానిలో తలాతోకా లేకుండా రోడ్ల నిర్మాణాలు

భూములిచ్చేది లేదని కొన్నిచోట్ల తేల్చిచెప్పిన రైతులు

ఆ ప్రాంతాలను వదిలేసి రోడ్లు వేస్తున్న ప్రభుత్వం

ఎక్కడ చూసినా అసంపూర్తిగా నిర్మాణాలు

రైతులకు పరిహారానికి ముందుకురాని ప్రభుత్వం  

సాక్షి, అమరావతి: ఎంతో ప్రతిష్టాత్మకంగా, ప్రణాళిక ప్రకారం నిర్మించాల్సిన రాజధాని రోడ్లపై ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. బిట్లు బిట్లుగా తలాతోకా లేకుండా రోడ్లను నిర్మిస్తుండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మూడు పంటలు పండే భూములను రాజధానికి ఇచ్చేదిలేదని పలుచోట్ల రైతులు తెగేసి చెప్పినా పట్టించుకోకుండా మొండిగా నిర్మాణాలు చేపట్టడంతో అవన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఎక్కడచూసినా రోడ్లు అసంపూర్తిగానే కనిపిస్తున్నాయి. రాజధానిని జాతీయ రహదారికి అనుసంధానించే కీలకమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణం మరీ దారుణంగా మారిపోయింది. రూ. 540 కోట్ల వ్యయంతో 21.5 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన ఈ రోడ్డును రెండు ప్యాకేజీలుగా విభజించారు. 18 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రోడ్డు, మిగిలిన భాగంలో ఫ్లైఓవర్‌ నిర్మించాల్సి వుంది. 18 కిలోమీటర్ల రోడ్డు పనుల్ని ఏడాది కిందటే ప్రారంభించినా సగం పనులు కూడా పూర్తి కాలేదు.

అందులో నాలుగు కిలోమీటర్ల మేర రైతులు భూసమీకరణ కింద తమ భూముల్ని ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో అలాంటి ముక్కల్ని వదిలేసి రోడ్డు నిర్మించుకుంటూ వెళుతున్నారు. ఆ ప్రాంతంలో భూముల విలువ ఎక్కువగా ఉండగా ప్రభుత్వం మాత్రం నామమాత్రంగా డబ్బు ఇవ్వడానికి మొగ్గు చూపడంతో రైతులు ఒప్పకోవడం లేదు. మరోవైపు రెండో ప్యాకేజీ కింద జాతీయ రహదారి నుంచి మణిపాల్‌ ఆస్పత్రి వెనుకభాగం గుండా నిర్మించాల్సిన ఫ్లైఓవర్‌ పనులకూ ఇంకా టెండర్‌ పిలవలేదు. ఆ ప్రాంతంలో ఎకరం భూమి విలువ నాలుగైదు కోట్లుండడంతో భూసేకరణకు వెళితే దానికంటే రెండు రెట్లు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందనే భయంతో ఆ పనుల గురించి ప్రభుత్వం నోరు మెదపడం లేదు. దీంతో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ఎప్పటికి పూర్తవుతుందో సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులకే అంతుబట్టడంలేదు.

మరిన్ని వార్తలు