వారపు సంతపై విజిలెన్స్‌

26 Sep, 2017 09:41 IST|Sakshi
వస్తువులను పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అధికారులు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల విస్తృత దాడులు

నకిలీ కందిపప్పు, కుంకుమపువ్వు, గుట్కాలు, టీపొడి లభ్యం

ఇకపై తరచూ దాడులు: విజిలెన్స్‌ ఎస్పీ సురేష్‌బాబు

శ్రీకాకుళం  ,సీతంపేట:
సీతంపేట వారపు సంతలో సోమవారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేశారు. ఆ శాఖ ఎస్పీ వి.సురేష్‌బాబు ఆధ్వర్యంలో డీఎస్పీ బర్ల ప్రసాద్, భద్రతా ఇన్‌స్పెక్టర్లతో కూడిన బృందం విస్తృతంగా సోదాలు చేసింది. నకిలీ ఆహార పదార్థాలు విక్రయిస్తున్న ఆరుగురిపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఎటువంటి పన్నులు చెల్లించకుండా అక్రమంగా తిరుగుతున్న నాలుగు వాహనాలను సీజ్‌ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ సురేష్‌బాబు మాట్లాడుతూ.. కల్తీ కందిపప్పు, శనగపప్పు వంటి వాటికి రంగులు వేసి అసలైన వాటిలా చేసి గిరిజనులకు విక్రయిస్తున్నారని వెల్లడించారు. వీటిని తీసుకుంటే కేన్సర్‌ వంటి రోగాలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. వాడేసిన టీ పొడిని మళ్లీ ప్యాక్‌ చేసి ఒరిజనల్‌ టీ పొడిగా విక్రయిస్తున్నారని తెలిపారు. ఖరీదైన కుంకుమ పువ్వు పేరు చెప్పి కలర్‌వేసిన పొట్టును అమ్ముతున్నారన్నారు.

గసగసాల పేరుతో రాజనాల అనే చిరుధాన్యాన్ని విక్రయిస్తున్నారన్నారు. ఇటువంటి వస్తువులతో పట్టుబడిన శిల్లా యోగేశ్వరరావు, ఐపీ సింహాచలం, కందుల దుర్గారావు, శిల్లారాము, కొత్తకోట దుర్గారావుపై కేసులు నమోదు చేసి.. వస్తువులను సీజ్‌ చేశామని వెల్లడించారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌ కోర్టులో దాఖలు పరుస్తామని తెలిపారు. గిరిజనులు ఇటువంటి నాసిరకం ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇకపై ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. నాసిరకం సరుకులు అమ్మితే ఎంతటివారికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు సతీష్‌కుమార్, చంద్ర, ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఎస్‌.ఈశ్వరి, కూర్మనాయకులు, అసిస్టెంట్‌ రిజిస్టార్‌ సూర్యత్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు