95 శాతం పల్స్‌పోలియో నమోదు

20 Jan, 2014 04:01 IST|Sakshi
చింతలపూడి, న్యూస్‌లైన్ : పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఒక్కరోజులోనే 94.85 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్టు డీఎంహెచ్‌వో టి.శకుంతల వెల్లడించారు. ఆదివారం చింతలపూడిలోని పలు పోలియో కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 3,84,386 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా ఇప్పటికే 3,64,669 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు చెప్పారు. 2,941 రూట్లలో 290 మంది సూపర్ వైజర్లు, 12,222 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. సోమ మంగళ వారాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి కేంద్రాలకు రాని పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేసి నూరుశాతం లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. నాలుగేళ్లుగా జిల్లాలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం సంతృప్తికరంగా సాగుతున్నట్లు డీఎంహెచ్‌వో చెప్పారు.
 
 త్వరలో డాక్టర్ పోస్టులు భర్తీ
 రెండు నెలల్లో జిల్లాలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. జిల్లాలో 152 డాక్టర్ పోస్టులకు 65 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. ఇటీవల కలెక్టర్ 19 పోస్టులు భర్తీ చేయగా వారిలో కేవలం 5 గురు మాత్రమే విధుల్లో చేరారని,  విధుల్లో చేరని డాక్టర్లను కలెక్టర్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టారని తెలిపారు. ఆరు నెలల్లో యర్రగుంటపల్లి పీహెచ్‌సీ భవనం పూర్తి అవుతుందన్నారు. మార్టేరు తుందుర్రు, దొమ్మేరు భవనాలు పూర్తి కావచ్చాయని చెప్పారు. గుడివాడలంక, జీలుగుమిల్లి, సిధ్ధాంతం, కామయ్యపాలెం పీహెచ్‌సీ భవనాలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఆమె వెంట రాఘవాపురం పీహెచ్‌సీ వైద్యాధికారి డా.డీఎల్ సురేష్, హెల్త్ సూపర్‌వైజర్ ఎస్‌కే అబ్రార్ హుస్సేన్, ఎంపీహెచ్‌ఈవో వెంకన్నబాబు పాల్గొన్నారు.  
 
 పోలియో మహమ్మారిని తరిమికొడదాం : కలెక్టర్ సిద్ధార్థ జైన్
 ఏలూరు అర్బన్, న్యూస్‌లైన్ : అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియో మహమ్మారిని తరిమికొడదామని కలెక్టర్ సిద్ధార్థ జైన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  ఆదివారం స్థానిక వన్‌టౌన్ ఆముదాల అప్పలస్వామి కాలనీలోని అర్బన్ ెహ ల్త్ సెంటర్‌లో కలెక్టర్ చిన్నారులకు చుక్కల మందు వేసి పోలియో చుక్కల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్దిపాటి నిర్లక్ష్యం కారణంగా ఎందరో చిన్నారులు పోలియో బారిన పడి విలువైన తమ జీవితాలను కోల్పోతున్నారన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.టి.శకుంతల, నగరపాలక సంస్థ కమిషనర్ జి.నాగరాజు, ఎంహెచ్‌వో డా.కె.సురేష్‌బాబు సిబ్బంది పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు