మంత్రి గౌతమ్‌ రెడ్డికి మరో కీలక శాఖ

30 Apr, 2020 20:32 IST|Sakshi

పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖను అప్పగించిన సీఎం జగన్‌

సాక్షి, విజయవాడ : ఇప్పటికే ప్రభుత్వ ప్రాధాన్య కీలక శాఖలైన పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ తదితర శాఖలను నిర్వహిస్తున్న మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా మరో శాఖను అప్పగించారు. పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖను మంత్రి గౌతమ్‌రెడ్డికి కేటాయిస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. 

జగన్‌కు అండగా నిలిచిన గౌతమ్‌రెడ్డి
వైఎస్సార్‌సీపీ ఆవిర్భారానికి ముందు నుంచి మేకపాటి కుటుంబం నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి అండగా నిలబడింది. ప్రధానంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి జగన్‌ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో కాంగ్రెస్‌ ఎంపీగా ఉండి వెంటనే పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరి ఎంపీగా గెలుపొందారు. ఆయన సోదరుడు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్‌ వెంట నడిచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఆ కుటుంబ రాజకీయ వారసుడిగా, జగన్‌కు సన్నిహితుడుగా ఉండే మేకపాటి గౌతమ్‌రెడ్డి 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. వరుసగా రెండో పర్యాయం కూడా అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి, బడా కాంట్రాక్టర్‌ బొల్లినేని కృష్ణయ్యపై ఘన విజయం సాధించారు. వరుసగా రెండు పర్యాయాలు గెలుపొందిన ఎమ్మెల్యేగా ఖ్యాతి గాంచారు. దీంతో సీఎం జగన్‌ ఆయనకు  ప్రభుత్వ ప్రాధాన్య కీలక శాఖలైన పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ తదితర శాఖలను అప్పగించారు. ఆ శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తుండటంతో తాజాగా పెట్టుబడులు, మౌలిక వసతులశాఖను అప్పగించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా