సీపీఎస్‌పై నేనున్నానంటూ వైఎస్‌ జగన్‌ భరోసా

8 Feb, 2019 10:28 IST|Sakshi

ప్రభుత్వ ఉద్యోగులకు పెనుగండంగా మారిన సీపీఎస్‌

సీపీఎస్‌పై ఉద్యోగుల ఉద్యమాన్ని అణచివేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

అధికారంలోకి వచ్చిన నెలలోపే సీపీఎస్‌ రద్దు..

స్పష్టమైన వైఖరి ప్రకటించిన వైఎస్‌ జగన్‌.. ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు

సాక్షి, అమరావతి: కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌).. ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర కలవరం రేపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేస్తున్న ఈ పింఛన్‌ పథకంపై ఏపీలో ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. గత నాలుగేళ్లుగా అనేక పోరాటాలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చిన ‘చలో అసెంబ్లీ’ పోరాటంలో భాగంగా ఉద్యమబాట పట్టిన సర్కారీ వేతనజీవులపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆందోళనకు ఉవ్వెత్తున తరలివచ్చిన ఉద్యోగులను కర్కశంగా అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో తీరని శాపంగా మారిన సీపీఎస్‌ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేనున్నానంటూ అండగా నిలబడ్డారు. అధికారంలోకి వచ్చిన నెలలోపే సీపీఎస్‌ను రద్దు చేస్తామని చెప్పడం ద్వారా ఉద్యోగ వర్గాలకు కొండంత భరోసా ఇచ్చారు. సీపీఎస్‌ విషయంలో కమిటీలు వేసి కాలయాపన చేయడం తప్ప చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ప్రకటనపై ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. (చదవండి: ఒక్క నెలలోనే సీపీఎస్‌ రద్దు చేస్తాం)

ఏమిటీ సీపీఎస్‌..?
గత కొంతకాలంగా ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను 2003లో అప్పటి ఎన్డీయే ప్రభుత్వం తొలిసారి తెరపైకి తెచ్చింది. దీనినే నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌సీఎస్‌) అని కూడా పిలుస్తారు. త్రిపుర, బెంగాల్‌​ మినహా మిగతా రాష్ట్రాలన్నీ ఆ పథకంలో క్రమంగా చేరాయి. ఈ పథకం రాకముందువరకు రిటైర్మెంట్‌ తర్వాత ప్రభుత్వమే ఉద్యోగులకు పెన్షన్‌ ఇస్తూ వచ్చింది. కానీ కొత్త స్కీమ్‌ ప్రకారం ప్రతినెల ఉద్యోగి జీతం నుంచి 10 శాతం కట్‌ చేస్తున్నారు. ప్రభుత్వం మరో 10శాతం నిధులు కలిపి పెన్షన్‌గా ఇస్తోంది. ఈ పెన్షన్‌ నిధిని నేషనల్‌ పెన్షన్‌ స్కీం ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌, నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌ ద్వారా షేర్‌ మార్కెట్‌లో మదుపు చేస్తారు. ఉద్యోగి పదవీ విరమణ సమయంలో సర్వీసు మొత్తంలో ఉద్యోగి, ప్రభుత్వ వాటా మొత్తం నిధిలో నిర్ణీతశాతం యూన్యూటీ ప్లాన్‌లో ఉంచి నెలవారీ పెన్షన్‌ను చెల్లిస్తారు. దీనికోసం 2013లో యూపీఏ ప్రభుత్వం విపక్ష ఎన్డీయే మద్దతుతో పెన్షన్‌ ఫండ్‌ రెగ్యూలేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ యాక్ట్‌ను తెచ్చింది.

సీపీఎస్‌ను ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
ఇదివరకు పెన్షన్‌ కోసం ఉద్యోగి జీతం నుంచి నగదును కట్‌ చేసేవారు కాదు. కొత్త విధానం ప్రకారం జీతంలో 10శాతం కోత పెడుతున్నారు. పాత విధానం ప్రకారం పెన్షన్‌ గ్యారెంటీ ఉండేది. పదవీ విరమణ ముందు ఉద్యోగి జీతం ఆధారంగా పెన్షన్‌ను ఖరారు చేసేవారు. ఉదాహరణకు పాత పెన్షన్‌ విధానంలో ఒక ఉద్యోగి బేసిక్‌ వేతనం రిటైరయ్యే నాటికి రూ. 60వేలు ఉందనుకుంటే పదవీ విరమణ తరువాత అతడికి రూ. 30వేలు పెన్షన్‌గా అందుతుంది. 40 శాతం కమ్యూటేషన్‌ చేసినా డీఏ, మెడికల్‌ అలవెన్సులు కలిపితే కుటుంబ అవసరాలకు తగినంత పెన్షన్‌గా వచ్చేది. కొత్త విధానంలో పెన్షన్‌కు ఎలాంటి భరోసా ఉండదు. (సీపీఎస్‌ రద్దు కోరుతూ... కదం తొక్కిన ఉద్యోగులు)

స్టాక్ మార్కెట్ పెరిగితే పెన్షన్ పెరుగుతుంది. సెన్సెక్స్ కుప్పకూలితే పెన్షన్ కూడా కరిగిపోతుంది. పాత విధానంలో పెన్షన్ ముందుగానే సరెండర్ చేయవచ్చు. దీన్నే కమ్యూటేషన్ అంటారు. సీపీఎస్‌లో ఆ సౌకర్యం లేదు. పాత విధానంలో పెన్షన్‌తో సంబంధం లేకుండా గరిష్ఠంగా 12 లక్షల వరకు గ్రాట్యూటీ వచ్చేది. ఇప్పుడు గ్రాట్యూటీ లేదు. పాత పెన్షన్ విధానం ప్రకారం ఉద్యోగి చనిపోయిన తర్వాత అతని కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్‌ వస్తుంది. ఉద్యోగి చివరి బేసిక్‌లో సగం, దానిపై డీఏను పెన్షన్‌గా ఇచ్చేవారు. కొత్త పెన్షన్ విధానంలో ఉద్యోగి చనిపోతే షేర్‌ మార్కెట్లో ఉన్న సొమ్ము మొత్తం ఆ కుటుంబానికి చెల్లిస్తారు. తరువాత ఆ ఎలాంటి పెన్షన్ ఉండదు. ఇలా అన్ని విధాల తీవ్ర విఘాతంగా మారిన సీపీఎస్‌పై గత కొంతకాలంగా సర్కారీ ఉద్యోగులు ఉద్యమిస్తూనే ఉన్నారు.

వైఎస్‌ జగన్‌ అండ
సీపీఎస్‌ వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేయడం మినహా వారి సమస్యను ఏనాడూ పట్టించుకొని పరిష్కరించలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆవేదనను, ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ నేనున్నానంటూ ముందుకొచ్చారు. సీపీఎస్‌ ఉద్యోగులకు న్యాయం చేస్తానని గతంలో పలుమార్లు హామీ ఇచ్చిన ఆయన.. తాజాగా గురువారం కడపలో నిర్వహించిన ఎన్నికల సమరశంఖారావం సభలో స్పష్టమైన వైఖరిని వెల్లడించారు. సీపీఎస్‌ విషయంపై ఉద్యోగులు అడిగితే మనం ఏం చెప్పాలని పార్టీ కార్యకర్త ఒకరు ప్రశ్నించగా.. ‘చంద్రబాబు సీపీఎస్‌ విషయంలో కమిటీలు వేసి కాలయాపన చేయడం తప్ప ఏమీ చేయలేదు. సీపీఎస్‌ కింద అన్ని వర్గాల ఉద్యోగులున్నారు. మూడు నెలల తర్వాత అన్న అధికారంలోకొస్తాడు.. అప్పుడు ఒక్క నెలలోపే సీపీఎస్‌ను రద్దు చేస్తాడని గట్టిగా చెప్పండి’ అని వైఎస్‌ జగన్‌ స్పష్టంగా సూచించారు. వైఎస్‌ జగన్‌ ఈ మేరకు స్పష్టమైన వైఖరి ప్రకటించడంపై ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


 

>
మరిన్ని వార్తలు