పుష్కరానికో కాన్పు!

25 Oct, 2013 00:31 IST|Sakshi

మెదక్ రూరల్, న్యూస్‌లైన్ : మామూలుగా ఏ ఆస్పత్రిలోనైనా వారంలో మూడు కాన్పులు కామన్. ఈ ఆస్పత్రికి ఎవరూ రారంటే వారంలో కనీసం ఒక్క చిన్నారైనా కేర్ మంటాడు. కానీ ఆస్పత్రి ప్రారంభించి 12 సంవత్సరాలైనా ఒక్క చిన్నారి ఏడుపు కూడా వినిపించని ఆస్పత్రి ఒకటుంది. ఎక్కడాని ఆలోచించకండి మన జిల్లాలోనే.. మెదక్ మండలంలోని సర్దన పీహెచ్‌సీ ఈ రికార్డు సాధించింది. ఇంతకీ ఈ గొప్ప ఇపుడెందుకు బయటకొచ్చిందంటే గురువారం సర్దన ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఓ మహిళ పండంటి బిడ్డను ప్రసవించింది.

ఇటీవల బదిలీపై ఇక్కడికొచ్చిన డాక్టర్ చంద్రశేఖర్ గురువారం సర్దన గ్రామానికి చెందిన గౌరీలక్ష్మికి పురుడుపోశారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. ఇప్పటి వరకూ తలనొప్పి, జలుబు, దగ్గు, జ్వరం తదితర వాటికే మందులిచ్చి పంపే ఆస్పత్రి సిబ్బంది కూడా తొలికాన్పు చేసి సంతోషపడిపోయారు. ఇకనుంచి సర్దన పీహెచ్‌సీలో కాన్పులు చేస్తామని వైద్యుడు చంద్రశేఖర్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు