ఫ్యాన్ ప్రభంజనం

8 May, 2014 02:05 IST|Sakshi
ఫ్యాన్ ప్రభంజనం
  • రెండు లోక్‌సభ స్థానాల్లోనూ స్పష్టమైన ఆధిక్యత
  •  అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు వైఎస్సార్‌సీపీకే
  •  జగన్‌కు పట్టం కట్టిన పల్లె, పట్టణ ఓటర్లు
  •  గెలుపు ధీమాలో ఆ పార్టీ శ్రేణులు
  •  సాక్షి, విజయవాడ : జిల్లాలో బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో ‘ఫ్యాన్’ ప్రభంజనం సాగింది. ప్రజల అంచనాలకు అనుగుణంగా, ప్రతిపక్ష పార్టీ అంచనాలను తలకిందులు చేస్తూ జిల్లా ఓటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిత్యం ప్రజలతో మమేకమవుతూ, సమస్యలపై రాజీలేని పోరాటం చేసే నేతలను ఎన్నుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.

    దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాకు చేసిన మేలును, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంపై ప్రజల్లో విశ్వాసం, పార్టీ అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న మంచి అభిప్రాయం వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటు వేసేందుకు మొగ్గు చూపిన అంశాలుగా ఉన్నాయి. జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలు, అత్యధిక అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. గవర్నర్‌కు నివేదిక ఇచ్చే ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు కూడా జిల్లాలో ఫ్యాన్ గాలి బాగా వీచిందని నివేదించినట్లు సమాచారం. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గెలుపుపై భరోసాతో ఉన్నారు.
     
    బారులు తీరిన ఓటర్లు...


    గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లెలు, పట్టణాల్లో ఓటర్లు ఉదయం నుంచే ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ముఖ్యంగా జిల్లాలో ఈ పర్యాయం కొత్తగా ఓటు హక్కు పొందిన యువత పెద్ద సంఖ్యలో ఓటేశారు. నూతన ఓటర్లు సుమారు 80 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అంచనా.
     
    విజయవాడ నగరం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో సగటున 75 శాతం పైనే పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా నూజివీడులో అత్యధికంగా 87 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ఆ తర్వాత మైలవరం, అవనిగడ్డ, పెడన, నూజివీడు, గన్నవరం, తిరువూరు, గుడివాడ, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేటలో 80 శాతం పైగా పోలింగ్ నమోదైంది. పామర్రు, పెనమలూరులో మాత్రమే 75 శాతం పోలింగ్ జరిగింది. విజయవాడ తూర్పులో 65.40 శాతం, పశ్చిమలో 67 శాతం, సెంట్రల్ నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యల్పంగా 65.33 శాతం పోలింగ్ నమోదైంది.
     
    అధినేతల విస్తృత ప్రచారం...
     
    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతూ పార్టీ అధినేతలు జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇది పార్టీ అభ్యర్థులకు పూర్తిస్థాయిలో కలిసొచ్చింది. వాస్తవానికి జిల్లాలో మూడు రోజులు మాత్రమే ఎన్నికల పర్యటన నిర్వహించేలా జగన్ షెడ్యూల్ ఖరారు అయింది. అయితే ఆ తర్వాత మూడు రోజుల షెడ్యూలు కాస్తా ఆరురోజులకు పెరిగింది.

    జిల్లాలోని గన్నవరం, అవనిగడ్డ, పెడన, కైకలూరు, పామర్రు, పెనమలూరు, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో వైఎస్సార్ జనభేరి నిర్వహించారు. అంతకుముందు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల కూడా పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. అధినేతల ప్రచారం పార్టీ అభ్యర్థులకు వరంలా మారింది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని గుండెల్లో పెట్టుకు పల్లె ఓటర్లు ఓటేసేందుకు వెల్లువెత్తారు. వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు.
     
    ప్రజల వెన్నంటే నేతలు...

    నిత్యం ప్రజలతో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ప్రజలు పట్టంకట్టినట్లు సమాచారం. ముఖ్యంగా గత మూడున్నరేళ్లుగా ప్రజలతో మమేకమవుతూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రజలతోనే పార్టీ నేతలు పయనం సాగించారు. దీంతో పాటు దివంగత మహానేత జిల్లాకు చేసిన మేలు, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరు వెరసి అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర పోషించే అంశాలుగా మారాయి.
     
    దీంతో విజయవాడ, మచిలీపట్నం లోక్‌సభ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జిల్లాలో పూర్తి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగటం మరో కలిసొచ్చే అంశం. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ వర్గాలు పోలింగ్ సరళిపై దృష్టి సారించాయి. జిల్లాలో అత్యధిక స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు దక్కుతాయని, ప్రతిపక్ష టీడీపీ మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని నివేదిక పంపినట్లు సమాచారం. మొత్తంమీద ఈ నెల 16వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగేవరకు ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూడాల్సిందే.

మరిన్ని వార్తలు