మంచి ప్రేమకథ ‘సాహెబా సుబ్రహ్మణ్యం’

28 Jul, 2014 02:29 IST|Sakshi
మంచి ప్రేమకథ ‘సాహెబా సుబ్రహ్మణ్యం’

ప్రేమకథ ఆధారంగా నిర్మించిన చిత్రం ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ అని, దీనిని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని హాస్యనటుడు ఎంఎస్ నారాయణ అన్నారు. హాయ్ లాండ్‌లో సినిమా ఆడియో ఫంక్షన్‌కు వెళుతూ నగరంలోని డీఎన్నార్ బ్రదర్స్‌లో ఆదివారం సాయంత్రం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా ఎంఎస్ నారాయణ మాట్లాడుతూ తన కుమార్తె శశి ఎంతో కష్టపడి ఈ సినిమాకు దర్శకత్వం వహించిందన్నారు. రేయింబవళ్లు కష్టపడి సినిమా సాంకేతిక వర్గాలను ఎంపిక చేసుకుందని, హీరోయిన్ ప్రియల్ గోర్‌ను ముంబయి నుంచి తెచ్చామని చెప్పారు.

ఈ సినిమా మలయూళ మాతృక అని ఆయన  వివరించారు. ఈ సినిమాలో విజయవాడకు చెందిన దిలీప్ హీరోగా నటించారన్నారు. ఈ సినిమాలో హింస ఏమీ ఉండదని, మొత్తం ప్రేమకథ ఆధారంగానే నడుస్తుందని చెప్పారు. హీరో దిలీప్ మాట్లాడుతూ ముస్లిం అమ్మాయి, హిందు అబ్బాయి మధ్య పుట్టినప్రేమతో తీసిన సినిమా అన్నారు.

నాలుగు పాటలు ఎంతో చక్కగా  వచ్చాయని, ఆగస్టు రెండోవారంలో చిత్రం విడుదల చేస్తామని చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాలోని కళాశాలలకు వెళ్లి విద్యార్థులను కలుస్తామన్నారు. ఈ సమావేశంలో హీరోయిన్ ప్రియల్ గోర్, దర్శకురాలు శశి, ఫొటోగ్రఫీ డెరైక్టర్ సాయి, సంభాషణల రచయిత కిట్టు, నటులు మీనాకుమారి, తాగుబోతు రమేష్  తదితరులు పాల్గొన్నారు.         
- విజయవాడ
 

మరిన్ని వార్తలు