పర్యాటకుల స్వర్గధామం వైజాగ్

28 Sep, 2014 01:53 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : పర్యాటకుల స్వర్గధామంగా వైజాగ్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం ఆర్కేబీచ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అయ్యన్న ప్రసంగిస్తూ పర్యాటకంగా జిల్లాను అభివృద్ధి చేయడానికి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఏజెన్సీలోని లంబసింగి, అల్లూరి సీతారామరాజు సమాధి ఉన్న కేడీ పేట ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నారు.

చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నకాలంలో మంజూరైన ప్రాజెక్టుల్లో ప్రగతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందన్నా రు. వాటన్నిం టినీ పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ను కోరారు. మంత్రి గంటా మాట్లాడు తూ బీచ్ కారిడా ర్ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సముద్రంలో ఒకటీ రెండు రోజుల పాటు క్రూయిజ్‌ల్లో విహారం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే విశాఖ పోర్టు చైర్మన్‌తో చర్చించినట్లు వెల్లడించారు. పర్యాటకంగా విశాఖ గురించి దేశమంతా తెలి సేలా విశాఖ ఉత్సవ్ నిర్వహించాలని అధికారులను కోరారు. సినిమా పరిశ్రమకు ఇప్పటికే విశాఖలో భూమి మం జూరు చేశామన్నారు.

కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ లాలం భవానీ, ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, విష్ణుకుమార్‌రాజు, కిడారి సర్వేశ్వరరావు, పీలా గోవింద్, వంగలపూడి అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్, కలెక్టర్ యువరాజ్, జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ ప్రవీణ్‌కుమార్, వుడా ఇంచార్జ్ వీసీ ఎంవీ శేషగిరిబాబు, పర్యాటకశాఖ విశాఖ డివిజన్ జనరల్ మేనేజర్ భీంశంకరరావు, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.
 
‘సాక్షి’కి బహుమతులు

పర్యాటక రంగానికి అద్దంపట్టేలా ఫొటోలు తీసిన సాక్షి ఫొటో జర్నలిస్టులు పీఎన్ మూర్తి, మహమ్మద్ నవాజ్‌లకు ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. ప్రజాశక్తి ఫొటో జర్నలిస్టు కె.రాజేశ్‌కు ప్రథమ బహుమతి వచ్చింది. వారికి మంత్రులు అయ్యన్న, గంటా జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశారు. రఫీ (లీడర్), విజయ్ (ఆంధ్రజ్యోతి), శరత్‌కుమార్ (టైమ్స్ ఆఫ్ ఇండియా), భాస్కరరావులకు ప్రత్యేక బహుమతులు ఇచ్చారు.  పర్యాటక దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
 

మరిన్ని వార్తలు