... అయితే ఎకరమివ్వండి

2 Nov, 2014 02:37 IST|Sakshi
... అయితే ఎకరమివ్వండి

మన పొరుగునే ఉన్న నవ్యాంధ్ర రాజధాని విజయవాడలోని ఆటోనగర్ ఆసియా ఖండంలోనే ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆటోమొబైల్ రంగంలో విడిభాగాలకు ప్రసిద్ధి చెందిన గుంటూరు ఆటోనగర్‌లో మీరేదైనా వాహనం పెట్టి 10 నిమిషాలు బయటకు వెళ్లొస్తే.. వాహనం ఉంటుంది కానీ ఒక్క పార్టూ ఉండదన్న చరిత్రను నమోదు చేసుకుంది. ఇలా ప్రతి ఊళ్లోని ఆటోనగర్‌కూ ఒక్కో చరిత్ర. ఏలూరు ఆటోనగర్ మాత్రం పూర్తిగా కొలువుదీరకుండానే స్థల వివాదాల్లో రికార్డులకు ఎక్కుతోంది. 20 ఏళ్ల కిందట మునిసిపాలిటీగా ఉన్న కాలంలోనే ఏలూరులో ఆటోనగర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు మొదలు కాగా, నగరంగా రూపాంతరం చెంది పదేళ్లవుతున్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. స్థలాల కేటాయింపుల్లోనే ఎన్నో ఏళ్లుగా రచ్చ జరుగుతోంది. జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు.. కోర్టు బయట స్థానిక నేతల నుంచి జిల్లా కలెక్టర్ పంచాయతీ చేసేవరకు వెళ్లింది.
 
 దశాబ్దాల పోరాటం తర్వాత ఇటీవలే స్థలాల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమమైంది. ఇదే సందర్భంలో అసోసియేషన్ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆటోమొబైల్ రంగానికి చెందిన నిరుపేదలు రోడ్డెక్కారు. కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసి పోరాటాలకు దిగారు. విచారణ చేపట్టిన పోలీసు అధికారులకు ఈ కేసు ఓ పద్మవ్యూహంలా కనిపిస్తోంది. ఎన్నో క్రిమినల్ కేసులను కూడా సునాయాసంగా ఛేదించిన అధికారులకు ఆటోనగర్ కేసు మాత్రం కందిరీగల తుట్టెను తలపిస్తోంది. ఎంతోమంది పేదల జీవితాలతో ముడిపడిన ఈ కేసును సునిశిత సమస్యగా భావించి పోలీసులు పరిష్కారానికి యత్నిస్తుండగా.. ఓ రాజకీయ నేత మాత్రం దీన్ని తనకు అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నారట. వాస్తవానికి బాధితులు ఇటీవల నగరంలోని ఓ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, ఆయన తనదైన శైలిలో ‘ఇది గత పాలకులు చేసిన పాపం..  ఇప్పుడు నేనున్నాగా.. చూస్తాను..  మీకు న్యాయం చేస్తాను’ అని భరోసా ఇచ్చి పంపారు.
 
 బాధితులు ఈ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లడంతో ఆటోనగర్ పెద్దలు అధికార పార్టీకే చెందిన మరో బడాబాబును ఆశ్రయించారని అంటున్నారు. ఎప్పటినుంచో అక్కడ స్థలం కోసం వేచిచూస్తున్న సదరు పెద్ద మనిషి ఇదే అదనుగా భావించి నేను ఎంతోకాలంగా ఆటోనగర్‌లో 600 గజాల స్థలం అడుగుతుంటే ఇదిగో.. అదిగో అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు ఎకరం స్థలం ఇవ్వండి.. మీకు ఇబ్బంది లేకుండా నేను సెటిల్ చేస్తాను అని భరోసా ఇచ్చారట. ఇప్పటికే తాము ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్ కింద లక్షలాది రూపాయలు ఇచ్చి ఉన్నామని ఇప్పుడు రూ.కోట్ల విలువైన ఎకరం ఎక్కడ ఇవ్వగలమని ఆటోనగర్ పెద్దలు ఆ నేత మొహం మీదే అడగాలని అనుకున్నా.. ఇప్పుడు పరిస్థితి తమకు అనువుగా లేకపోవడంతో నోరునొక్కుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేశారట. తాజా పరిణామాల నేపథ్యంలో ఇటు అధికారుల వద్దకు.. అటు బడా నేతల వద్దకు వెళ్లిన ఆటోనగర్ పంచాయతీ చివరకు ఏమవుతుందో చూడాలి.
 
 గౌస్ అరెస్టులోనూ రాజకీయ కోణమా
 ‘వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోయినట్టు...’ లెక్చరర్ గౌస్ మొహియిద్దీన్ అరెస్టైన సందర్భంలో ఓ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్య ఇది. ఈ వాన నిజంగానే గాలివాటంగా వచ్చిందా.. లేదా కృత్రిమ మేఘ మథనమా అనేది ఇప్పుడు పోలీసు, రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయమవుతోంది. గౌస్ షాడో పోలీస్ బాస్‌గా ఎన్నో ఏళ్లుగా వ్యవహరిస్తూ వచ్చాడు. గత మూడు, నాలుగేళ్లలో అడ్డు, అదుపు లేకుండా పైరవీలు సాగించాడు. ఈ నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన వారితోనే అత్యంత సన్నిహితంగా ఉండి మరో వర్గానికి చెందిన అధికారులను దెబ్బతీశాడన్న ప్రచారముంది. ఇప్పుడు అప్పటి బాధిత వర్గానికి చెందిన వారు పాలకులుగా ఉండటంతో అదను చూసి గౌస్‌ను ఉచ్చులో బిగించారని వాదించే వారూ లేకపోలేదు.
 
 మొత్తంగా వర ్గపోరులోనే గౌస్ బలిపశువయ్యాడన్న వాదనలపై ఓ రేంజ్ స్థాయి అధికారి ఇలా స్పందించారు. ‘ఏదైతే ఏమైంది.  ఓ బడా వైట్‌కాలర్ నేరస్తుడుని పట్టుకున్నాం. మా పోలీసోళ్లంటారా. డాక్టరేట్ చేసిన లెక్చరర్ కదా. నాలుగు మంచి పనులు చేస్తాడని వెళ్లి ఉంటారు. ఇప్పుడు బండారం బయటపడింది కదా. ఇంకెప్పుడూ ఇలా ఎవరిని పడితే వాళ్లను నమ్మరు. జాగ్రత్తగా ఉంటారు. పైరవీకారులను నమ్మే ప్రజలకూ ఇదొక పాఠం లాంటిదే’ అని సూత్రీకరించారు. మరి గౌస్ వల్ల లబ్ధి పొందిన వాళ్లు ఏమంటారో?
 - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు
 

మరిన్ని వార్తలు