ఏపీ ఉభయసభలనుద్దేశించి 21న గవర్నర్ ప్రసంగం

16 Jun, 2014 01:02 IST|Sakshi
ఏపీ ఉభయసభలనుద్దేశించి 21న గవర్నర్ ప్రసంగం

19న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
అదేరోజు సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై 23న చర్చ

 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి, శాసనసభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఈ నెల 21న ప్రసంగించనున్నారు. రాష్ట్రం విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి అసెంబ్లీ సమావేశాలు ఇవే. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈనెల 23, 24 తేదీల్లో చర్చ జరుగుతుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ చర్చకు 24న సమాధానమిస్తారు. శాసనసభాపతి, ఉప సభాపతి ఎన్నిక 20వ తేదీన జరుగుతుంది. శాసనసభ సమావేశాలు 19వ తేదీ గురువారం ఉదయం 9.15 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల తేదీని నిర్ణయిస్తూ ప్రభుత్వం పంపిన ఫైలుపై గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆదివారం సంతకం చేశారు. శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందురోజు అంటే 18వ తేదీన సీనియర్ శాసనసభ్యుడు పతివాడ నారాయణస్వామి నాయుడు ప్రొటెం స్పీకర్‌గా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారు.

19వ తేదీ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నేత, ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేస్తారు. 22వ తేదీ ఆదివారం అసెంబ్లీకి సెలవు. శాసనసభ సమావేశాల ప్రారంభం రోజు (19)న ఉదయం ఎనిమిది గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంగా ఎంపికైన రాజ్‌భవన్ రోడ్డులోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌కు వెళతారు. అక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇకపై అక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తారు. చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో సోమవారం పర్యటించనున్నారు.
 
 

మరిన్ని వార్తలు