పసిడి చిన్నబోయింది

3 Nov, 2014 02:12 IST|Sakshi
పసిడి చిన్నబోయింది
  • హుదూద్‌తో కళతప్పిన మార్కెట్
  •  భారీగా ధర తగ్గినా కొనుగోళ్లు స్వల్పమే
  •  ముందుకురాని జనం
  •  ఆశాభావంతో వర్తకుల నిరీక్షణ
  •  ఆర్నమెంట్ బంగారం గ్రాము ధర రూ. 2470/
  •  24కేరట్స్ గ్రాముకు రూ. 2695/
  • విశాఖపట్నం సిటీ: బంగారు కొనుగోళ్లనూ హుదూద్ ప్రభావితం చేసింది. పసిడి మార్కెట్ కళ కోల్పోయేలా చేసింది. గతనెల 12నుంచి  కొనుగోళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఆఖరుకు బంగారం ధర తగ్గినా స్పందన కనిపించలేదంటే పరిస్థితి అర్ధమవుతుంది. తాజాగా బంగారం ధర భారీగా తగ్గింది. ఆర్నమెంట్ గోల్డు గ్రాము ధర రూ. 2500 కిందికి తగ్గింది. గత గురువారం నుంచీ అంతకన్నా తక్కువ ధర వద్దే విశాఖ బులియన్ సూచీలు కదలాడుతున్నాయి. గ్రాము ధర రూ.2450 నుంచి 2470 మధ్య గత రెండు రోజులుగా వున్నాయి.

    సోమవారం ఉదయం 11 గంటల వరకూ అలాగే ధర నిలచివుంటుంది. అయినా కొనడానికి పెద్దగా జనం ముందుకు రావడం లేదు. హుదూద్ అంతగా కొనుగోలుదారులను ఇబ్బంది పెట్టింది. హుదూద్ చేసిన నష్టాలు కళ్ల ముందే కనిపిస్తుండడంతో బంగారం మార్కెట్‌వైపు అడుగులు పడటంలేదు. నగరంలో 20 పేరొందిన షాపులున్నాయి. చిన్నాచితకా కలుపుకుంటే 300 ఉన్నాయి. రోజూ సగటున ఈ షాపుల్లో రూ. 20 కోట్లు కొనుగోళ్లు జరిగేవి.
     
    ప్రస్తుతం రోజూ సుమారు రూ.10 కోట్ల కన్నా తక్కువే బంగారు కొనుగోళ్లు జరుగుతున్నాయని పసిడి మార్కెట్ వర్గాల అంచనా. ఎక్కువమంది నగరవాసులు సాధారణంగా బంగారంలో పెట్టుబడి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడే వుండడంతో పొదుపు పేరిట బంగారంపై మదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని మల్టీనేషనల్ దుకాణాలు  రంగప్రవేశం చేశాక కొందరు ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకుని పొదుపు చేసేందుకు ఇదో మార్గంగా ప్రోత్సహిస్తున్నారు.
     
     తుపాను వల్లే మందగింపు
     తుఫాన్ ప్రభావం వల్ల అమ్మకాలు కాస్త మందగించిన మాట వాస్తవమే. మళ్లీ పుం జుకుంటాయని ఆశిస్తున్నాం. 10 రోజులు దాటిన తర్వాత పెళ్లిళ్ల హడావిడి ఊపందుకుంటుంది. అప్పుడు మళ్లీ పసిడి అమ్మకాలు పెరుగుతాయి. గత కొన్నేళ్ల పెరుగుదలకు బ్రేక్ ఇస్తూ దాదాపు ధర 20 శాతం తగ్గింది. ఇంత కన్నా తగ్గే ఛాన్స్ లేదు.
     -సురేష్ కుమార్ జైన్, సంఘ్వీ జ్యూవెలర్స్/విశాఖ బులియన్ అధినేత
     

మరిన్ని వార్తలు