వలస జీవుల విలవిల

16 Jan, 2016 23:26 IST|Sakshi

తలో చోట కట్టుబానిసల్లా దుర్భర జీవితం
చెప్పిన ఉద్యోగం లేదు.. చేస్తున్న దానికి జీతమూ లేదు
తిండి, నిద్ర కరువై నరకయాతన
నగరం నుంచి సౌదీకి వెళ్లిన 15 మంది దుస్థితి
కాపాడమంటూ ప్రభుత్వానికి లేఖ

 
విశాఖపట్నం: దూరపు కొండలు నునుపు.. అనే సామెతను విదేశీ ఉద్యోగాల మోజులో పడి ఎందరో విస్మరిస్తున్న ఉదంతాలు బయటపడుతూనే ఉన్నాయి. అయినా ఉన్న ఊరిలో ఉపాధి లేక.. ఆస్తులు అమ్మి, అప్పులు చేసి పొట్ట చేతపట్టుకుని పరాయి దేశాలకు వెళుతున్న వారిలో చాలామంది హీనమైన బతుకులు సాగిస్తున్నారు. ఉద్యోగాలని చెప్పి తీసుకెళ్లి బానిస పనులు చేయిస్తున్న అటువంటి మరికొందరు అభాగ్యుల వ్యథార్థ బతుకులు ‘సాక్షి’కి అందిన ఓ ఈ మెయిల్ లేఖ ద్వారా వెల్లడయ్యాయి. ఆ లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. నగరంలోని ద్వారకానగర్‌లో ఉన్న ఆల్-హసీం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్, కన్సల్టెంట్స్ అనే సంస్థ సౌదీ ఆరేబియాలో ఉద్యోగాలకు గత ఏడాది జూలైలో ఇంటర్వ్యూలు నిర్వహించింది. జిల్లాలోని ప్రాంతాలకు చెందిన 15 మందిని ఈ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశారు. వారిని సౌదీలోని ‘సౌదీ ఆర్మ్‌కో’ అనే పెద్ద కంపెనీకి చెందిన సబ్ కాంట్రాక్ట్ సంస్థలో ఎలక్ట్రిషియన్, సూపర్‌వైజర్, తదితర ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఒక్కొక్కరి నుంచి రూ.80 వేలు తీసుకుని గత అక్టోబర్‌లో సౌదీకి తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత బాధితులకు అసలు విషయం అర్ధమైంది.

అక్కడ వారికి కనీస సదుపాయాలు లేవు సరికదా..  ముందుగా చెప్పినట్లు సబ్ కాంట్రాక్ట్ సంస్థలు ఉద్యోగాలు కల్పించలేదు. ఒక చిన్న సప్లై కంపెనీలో కొందరికి చిన్న చిన్న పనులు చూపెట్టారు. మిగిలిన వారిలో ఒక్కొక్కరినీ ఒక్కో చోట పనికి కుదిర్చారు. దేశం కాని దేశంలో బతకడం కోసం వారు చెప్పిన పనల్లా చేయడం తప్ప బాధితులకు వేరు గత్యంతరం కనిపించలేదు. ఇంత చేసినా జీతాలు వస్తాయనుకంటే అవీ లేవు. కనీసం వారి గోడు వినేవారేలేరు. తిండి, నిత్ర కరువై నరకం చూస్తున్నారు. తమను సౌదీకి పంపించిన అస్లంఖాన్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసి, పరిస్థితి వివరించినా సరైన స్పందన లేదు. ఇక చేసేది లేక ధైర్యం కూడగట్టుకుని భారత ప్రభుత్వాన్ని అడ్రస్ చేస్తూ మీడియాకు లేక విడుదల చేశారు. జీవనభృతి కోసం వచ్చిన తాము జీవితమే కోల్పోయే భయానక పరిస్థితిలో ఉన్నామని, తమను కాపాడమని కన్నీటితో వేడుకుంటున్నామని లేఖలో రాశారు.

సమస్యలు వాస్తవమే.. పరిష్కరిస్తాం:ఏజెంట్
దీనిపై ఏజెంట్ అస్లాంఖాన్‌ను ‘సాక్షి’ సంప్రదించగా..కావాలనే కొందరు సమస్య సృష్టిస్తున్నారన్నారు. జీతాలు అందకపోవడానికి సాంకేతిక కారణాలున్నాయని, ఈలోగా వారి భోజన ఖర్చులకు డబ్బులు కూడా పంపించామని చెప్పారు. ఆ పదిహేను మందిని తీసుకువెళ్లిన సూపర్‌వైజర్ కొత్తవాడు కావడంతో గందరగోళం ఏర్పడిందని వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. తాను లెసైన్స్ కలిగిన ఏజెంటునని, కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా ఇండియన్ ఎంబసీ ద్వారా సౌదీ కంపెనీపై చర్యలు తీసుకునేలా చూస్తామని వివరించారు.
 

మరిన్ని వార్తలు