ఎంత కష్టం.. ఎంత కష్టం!

15 Jun, 2015 02:37 IST|Sakshi
ఎంత కష్టం.. ఎంత కష్టం!

అసలే నిరుపేద కుటుంబం
ముగ్గురు సంతానం అంధులు
నాలుగో కుమారుడికి  లుకేమియా (క్యాన్సర్)
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

 
 వారిది నిరుపేద కుటుంబం.. నలుగురు సంతానం.. అందులో మొదటి ముగ్గురు అంధులు.. నాలుగో కుమారుడు లుకేమియా అనే రక్త క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు.. కుమారుడి వ్యాధి బాగు చేయించే ఆర్థిక స్థోమత లేక ఆవృద్ధ తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు.
 
అట్లూరు : అట్లూరు గ్రామ పంచాయతీలోని గాండ్లపల్లికి చెందిన భూర్సు చిన్నవెంకటయ్య, వెంకటసుబ్బమ్మ దంపతులకు నలుగురు సంతానం. సుబ్బమ్మ, నరసమ్మ, పెంచలయ్య ఈ ముగ్గురూ పుట్టుకతోనే గుడ్డివారు. ఈ సారైనా అన్ని అవయవాలు సక్రమంగా కలిగిన సంతానం కలగాలని ఆ దంపతులు పూజలు, నోములు చేశారు. వారికి కుమారుడు పుట్టాడు. ఆ చిన్నారికి కళ్లు బాగా కనిపిస్తాయని సంతోషించారు. అంధులను చూసి బాధపడుతూ.. వెంకటసుబ్బయ్యను చూసి సంతోష పడుతూ వారు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. వెంకటసుబ్బయ్యను 7వ తరగతి వరకు చదివించారు. భార్యాభర్తల సంపాదన అంధులైన పిల్లల పోషణకు చాలకపోవడంతో వెంకటసుబ్బయ్యను బడి మానిపించారు. ఆ బాలుడినీ కూలీ పనులకు తీసుకెళ్లే వారు.

 మరోసారి విధి వక్రీకరించింది:
 వారి పట్ల దేవుడు మరో సారి చిన్నచూపు చూశాడు. నెల రోజులుగా వెంకటసుబ్బయ్య జ్వరంతో మంచం పట్టాడు. కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఫలితం కనిపించ లేదు. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స చేయించారు. జ్వరం నయం కాలేదు. స్విమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షల అనంతరం వైద్యులు మెల్లిగా గుండె ఆగి పోయేలాంటి వార్త చెప్పారు. వెంకటసుబ్బయ్యకు లుకేమియా అనే రక్త క్యాన్సర్ వచ్చిందని తెలిపారు.

క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లి బాగు చేయించుకోవాలని సూచించారు. ఆ వ్యాధి చికిత్సకు రూ.12 నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు కుమారుడిని ఇంటికి తీసుకొచ్చారు. వచ్చిన వ్యాధి గురించి చెప్పడం, ఏడ్చడం తప్ప వారు ఏమీ చేయలేని స్థితి. ఇప్పటికే అప్పు చేసి రూ.70 వేల వరకు ఖర్చు పెట్టామని, ఇక చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వారు కోరుతున్నారు. కాగా, చిన్నవెంకటయ్య, వెంకటసుబ్బమ్మది వరుసగా మూడో తరం మేనరికపు వివాహం. అందువల్లే ఈ అనర్థాలు అంటూ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. సహాయం చేయాలనుకునే వారు  ఫోన్ నంబర్: 7093725038ను సంప్రదించవచ్చు.
 
 వైద్యాధికారి ఏమంటున్నారంటే..
 వెంకటసుబ్బయ్యకు సోకిన లుకేమియా క్యాన్సర్‌కు వైద్యం చేయించాలంటే చాలా ఖర్చు అవుతుంది. చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్, తమిళనాడులోని అడయార్, పూణె తదితర ప్రాంతాల్లో ఎక్కడికో ఒక చోటుకు వెళ్లాల్సి ఉంటుంది. బాధితుడి వయస్సు 18 ఏళ్లు కనుక చికిత్సకు అనుకూలించవచ్చు. త్వరితగతిన స్పందిస్తే ఫలితం ఉంటుంది.
      - జబిఉల్లా, వైద్యాధికారి, అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

>
మరిన్ని వార్తలు