నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

20 Jun, 2015 03:07 IST|Sakshi
నగరాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి

- వారానికో రోజు సమీక్ష
- కొండ ప్రాంతవాసులకు పట్టాలు
- పేదలకు 20వేల పక్కా ఇళ్లు
- చెత్త నుంచి విద్యుదుత్పత్తికి ప్లాంట్
- కార్పొరేషన్ అధికారులతో చంద్రబాబు
- నగరపాలక సంస్థ అధికారులతో సీఎం భేటీ
- ఇంకా పలు నిర్ణయాలు
సాక్షి, విజయవాడ :
‘ఒక్క అమరావతే కాదు, విజయవాడ, గుంటూరు నగరాలను బాగా అభివృద్ధి చెందాలి. ఇందుకు కావాల్సిన అనుమతులను ఇప్పిస్తాం. ఇక్కడ ఫైల్స్ పెండింగ్‌లో ఉండకుండా తక్షణం క్లియర్ చేయిస్తా. నగరాభివృద్ధిపై వారానికి ఒకరోజు సమీక్ష నిర్వహిస్తా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులు, అధికారులకు హామీ ఇచ్చారు. తన పేషీలోని అధికారులకు ఫోన్ చేసి ఇక నుంచి విజయవాడ నుంచి వచ్చే ఫైల్స్ తక్షణం క్లియర్ చేయమంటూ ఆదేశించారు. గురువారం రాత్రి నగరంలోనే బస చేసిన చంద్రబాబు శుక్రవారం ఉదయం బస్సులోనే నగరపాలకసంస్థ అధికారులతోనూ సమావేశం నిర్వహించారు. ఇక నుంచి అప్పడప్పుడు ఆకస్మిక తనిఖీలు కూడా చే స్తుంటానని హెచ్చరించారు. ఈనెల 26వ తేదిన మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తానని సూచించారు.  
 
కొండ ప్రాంతవాసులకు పట్టాలు
నగరపాలకసంస్థ అధికారులతో మాట్లాడుతూ కొండప్రాంతాల్లో నివసించే పేదలందరికీ పట్టాలిచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. ఇప్పటివరకు ఉన్న ఇళ్లను గుర్తించి, అక్కడనుంచి కొండ పైకి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగరంలో పేదలకు 20వేల పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు మహేంద్ర కంపెనీ ముందుకు వచ్చిందని, ల్యాండ్ పూలింగ్‌లో స్థలం సేకరించి, వారి చేత కట్టిస్తానని చంద్రబాబు తెలిపారు.  
 
చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు

సీఆర్‌డీఏ పరిధిలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు విదేశీ కంపెనీలతో మాట్లాడుతున్నానని చెప్పారు. డంపింగ్ యార్డుకు కేటాయించిన 20 ఎకరాల స్థలం వేరే అవసరాలకు వాడుకోవాలని సూచిం చారు. కాల్వల బ్యూటిఫికేషన్ చేయాలని, కాల్వగట్లపై నివసించేవారికి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే ఖాళీ చేయించాలని సూచించారు. భవానీద్వీపాన్ని అభివృద్ధి చేయడానికి తాను ప్రైవేటు కంపెనీలతో సంప్రదిస్తున్నట్లు అధికారులకు వివరించారు. సిబార్ డిస్నీల్యాండ్ స్థలం గురించి మాట్లాడుతూ దాని యజమానులతో సంప్రదించాలని అక్కడ మరో ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలని సూచిం చారు. సమావేశంలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్, మేయర్ కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్ గోగులరమణారావు, కమిషనర్ వీరపాండ్యన్, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ నగరపాలకసంస్థ ఇంజినీర్లు పాల్గొన్నారు.  
 
జీ+2కు ‘మార్టిగేజ్ రద్దు’

250 గజాలు లోపు భవననిర్మాణాలకు జీ+2 ఇళ్లు నిర్మించుకునేందుకు ‘మార్టిగేజ్’ చేయాల్సిన అవసరం లేకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సీఆర్‌డీఏ అధికారులకు సూచించారు. వర్షపు నీరు వెళ్లేందుకు నగరంలో సరైన వ్యవస్థ లేనందున దానికి కావాల్సిన డీపీఆర్‌లు తయారు చేయాలని సూచించారు. విజయవాడ(తూర్పు, సెంట్రల్) నియోజకవర్గంలో మంచినీటి ప్లాంట్లు ఏర్పాటుకు కావాల్సిన టెండర్లు పిలవాలని, వాటికి కావాల్సిన నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు