ఫేస్‌బుక్‌లో మోసగించిన మహిళ అరెస్టు

20 Aug, 2014 03:25 IST|Sakshi

ఒంగోలు క్రైం : ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిని పెళ్లిచేసుకుంటానని నమ్మించి కుటుంబ అవసరాల పేరుతో 4.20 లక్షల రూపాయలు కాజేసిన మహిళను ఒంగోలు టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. టూటౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ వి.సూర్యనారాయణతో కలిసి ఆ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒంగోలు డీఎస్పీ పి.జాషువా ఆ వివరాలు వెల్లడించారు.

నెల్లూరుకు చెందిన ఆనం రాజ్యలక్ష్మి జరుగుమల్లి గ్రామానికి చెందిన డి.అశోక్‌రెడ్డికి ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. దాంతోపాటు తెలుగు మాట్రిమనీ.కాం, వాట్స్‌ఆప్ ద్వారా ఒకరికొకరు పరిచయం పెంచుకున్నారు. గతంలో విదేశాల్లో పనిచేసి వచ్చి ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అశోక్‌రెడ్డికి ఇంకా వివాహం కాలేదు. ఈ నేపథ్యంలో అతన్ని పెళ్లి చేసుకుంటానని రాజ్యలక్ష్మి నమ్మించింది.

కుటుంబ అవసరాలున్నాయంటూ మూడు విడతలుగా మొత్తం రూ.4.20 లక్షలను తన అకౌంట్‌లో ఆన్‌లైన్ ద్వారానే జమచేయించుకుంది. నెల్లూరు, ఒంగోలులోని ఏటీఎం సెంటర్ల నుంచి ఆ నగదును డ్రా చేసుకుంది. అయితే, ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో తన ఫొటో కాకుండా వేరే యువతి ఫొటోపెట్టి అశోక్‌రెడ్డిని మోసం చేసింది. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నానని కూడా నమ్మించింది.

చివరకు ఫేస్‌బుక్ నుంచి తప్పుకోవడంతో మోసపోయానని తెలుసుకున్న అశోక్‌రెడ్డి.. సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. మంగళవారం రాజ్యలక్ష్మిని అరె స్టు చేశారు. ఇదే తరహాలో గతంలో కూడా మరో ఇద్దరిని ఆమె మోసం చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వరుణ్ అనే ఎన్నారై నుంచి రూ.1.20 లక్షలు, అర్జున్‌రెడ్డి నుంచి రూ.80 వేలు కాజేసినట్లు తమ విచారణలో తేలిందని ఆయన వివరించారు. నిందితురాలిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు