భార్యవు కాదు పొమ్మంటున్నాడు

9 Feb, 2015 09:01 IST|Sakshi

* నమ్మించి తల్లిని చేశాడు...
* భార్యవు కాదు పొమ్మంటున్నాడు
* న్యాయం కోసం యువతి వేడుకోలు


గాంధీనగర్ : ప్రేమ పేరుతో నమ్మించి, తల్లిని చేసి పెళ్లి కూడా చేసుకుని తప్పించుకోవాలని చూస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఓ యువతి వేడుకుంటోంది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రీస్తురాజుపురానికి చెందిన యువతి ఈ వివరాలు తెలియజేసింది. క్రీస్తురాజుపురంలోని ఓ ప్రార్థనా మందిరం నిర్వాహకురాలి కుమారుడు రత్న క్రిస్టఫర్ డేవిడ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడని తెలిపింది. గర్భవతిని కావడంతో విషయం బయటకు చెబితే తనను, కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ బెదిరించాడని చెప్పింది.
 
అబార్షన్ చేయించుకోవాలని వత్తిడి చేశారని, అందుకు వైద్యులు నిరాకరించడంతో తాను గతేడాది అక్టోబర్ 10న ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు తెలిపింది. అదేనెల 22న యనమలకుదురులోని ప్రార్థనా మందిరంలో తనను వివాహమాడాడని చెప్పింది. తరువాత కొద్దినెలలకు కొద్దినెలలకు తాను భార్యను కానని, బిడ్డ తనకు పుట్టలేదని, అనవసరంగా వేధిస్తున్నానని, తనకు అప్పటికే పెళ్లియిందంటూ మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిపింది. తనను భార్యగా స్వీకరించాలని, బిడ్డను తమబిడ్డగా అంగీకరించి న్యాయం చేయాలని వేడుకుంది.
 
చట్టం నుంచి తప్పించుకునేందుకే వివాహమాడాడు  
యువతిని నమ్మించి తల్లిని చేసిన రత్న క్రిస్టోఫర్ డేవిడ్ చట్టం నుంచి తప్పించుకునేందుకే ఆమెను వివాహమాడాడని మాదిగ హక్కుల పోరాట సేన అధ్యక్షుడు సంగెపు జయరాజు అన్నారు. వాస్తవానికి అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాల్సి ఉందన్నారు. దానినుంచి తప్పించుకునేందుకే యువతిని పెళ్లిచేసుకుని మరోసారి మోసగించేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. డేవిడ్‌తోపాటు అతడికి సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఆమె తరఫున న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో జై ఆంధ్ర జేఏసీ నాయకులు ఎల్. జైబాబు, ఎన్.కాళిదాసు, కె.బుజ్జి, బాధితురాలి తల్లి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు