ఎక్కడైనా.. ఎప్పుడైనా రేషన్

15 Nov, 2014 00:49 IST|Sakshi
ఎక్కడైనా.. ఎప్పుడైనా రేషన్

* త్వరలో అమలులోకి రానున్న పోర్టబిలిటీ
* ‘తూర్పు’ నుంచే పైలట్ ప్రాజెక్టు!

సాక్షి, రాజమండ్రి : బడుగులకు రేషన్ పంపిణీ విధానంలో సంస్కరణలు తేవడమే కాకుండా ఆధార్ అనుసంధానంతో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు మరో కొత్త ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా రేషన్ కార్డు పోర్టబిలిటీ విధానం అమలులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలో వంద దుకాణాల్లో అమలవుతున్న ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సర్వీస్ (ఈపీఓఎస్) వచ్చే నెల 15 నుంచి జిల్లా అంతటా అమలు చేస్తున్నారు. ఈ విధానం కూడా జిల్లాలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడే ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపదికన అమలులోకి తేనున్న ఈ విధానానికి పౌర సరఫరాల శాఖ కమిషనర్ గ్రీన్‌సిగ్నల్ కూడా లభించింది.
 
పోర్టబిలిటీ అంటే..
ఇదొక స్మార్ట్ కార్డు తరహా విధానం. స్మార్ట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్ విధానంలో ఎలా సేవలు పొందుతామో, అలాగే ఏ ఊళ్లో లేదా, ఏ జిల్లాలో నుంచైనా సరకులు తెచ్చుకునే వీలుంటుంది. ఇప్పటి వరకు రేషన్ దుకాణాల్లోనే సరకులు తెచ్చుకునే వారు. ప్రతి నెలా 18లోగా తెచ్చుకోకపోతే అవి వెనక్కి వెళ్లిపోతాయి. ఇలాంటి ఇబ్బందులు ఈ విధానంలో ఉండవు. ఏ రేషన్ దుకాణం నుంచైనా ఎప్పుడైనా సరకులు తెచ్చుకోవచ్చు. ఇతర ప్రాంతాలకు వెళ్లినా.. సమీపంలోని రేషన్ దుకాణం నుంచి సరకు తెచ్చుకోవచ్చు.
 
సాధ్యమేనంటున్న అధికారులు
జిల్లాలో 99 శాతం రేషన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. ఆ డేటా అంతా సెంట్రలైజ్డ్ విధానంలో ప్రధాన సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. ఆధార్ నంబరును పరీక్షించి, ఆన్‌లైన్ చేస్తారు. కార్డు నంబరు రేషన్ దుకాణంలో ఫీడ్ చేస్తే లబ్ధిదారుడి వివరాలు లభ్యమవుతాయి. కేటాయించిన మేరకు సరకు ఇస్తే ఆ వివరాలు అక్కడే ఆన్‌లైన్‌లో నమోదవుతాయి. ఏ దుకాణంలో పరిశీలించినా.. ఆ వివరాలు తెలుస్తాయి. దీంతో మరోచోట సరకులు తీసుకునే వీలుండదు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు.
 
అంతా సరళీకృతం
జిల్లాలో దాదాపు 2700 రేషన్ దుకాణాలున్నాయి. వీటిలో ప్రతీ నెలా ఒకటి నుంచి 18వ తేదీ వరకూ సరకులు ఇస్తారు. తర్వాత  19న డీలర్లు వాటి రికార్డులు సమర్పిస్తారు. కొత్తగా వచ్చే సరకు కోసం డీడీలు తీస్తారు. 20 నుంచి 30 వరకూ డీలర్లకు సరకు చేరుతుంది. కొత్త విధానం వల్ల ఈ వంతుల వారీ పద్ధతులు ఉండవు.

డీలర్లకు సరకు పరిమితి తొలగిస్తారు. రోజుకు ఎన్ని కార్డులకు, ఎంత సరకు ఇచ్చారో ఆన్‌లైన్‌లో గణాంకాలు స్పష్టమవుతాయి. రాజమండ్రిలో ఈపీఓఎస్‌పై అధికారులతో నిర్వహించిన సమీక్షలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ ఎదుట జిల్లా మేనేజర్ కుమార్ ఈ ప్రతిపాదన ఉంచారు. ముందుగా ఇక్కడి నుంచే ఒకేసారి ఈ విధానం ప్రారంభించాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టుగా అమలయ్యాక రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు