-

ఆశలపై నీళ్లు

11 Mar, 2019 13:10 IST|Sakshi
లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా చేస్తున్న ఆశావర్కర్లు

జీఓకు తూట్లు

రెండు నెలలుగా నిలిచిన వేతనాలు

అయ్య ‘బాబో’య్‌ ఎంత మోసం

పాలకొల్లు అర్బన్‌: తెలుగుదేశం ప్రభుత్వం ఆశావర్కల ఆశలపై నీళ్లు పోసింది. గౌరవ వేతనం ఇవ్వాలని ఆశావర్కర్లు ఎన్నో ఏళ్ల నుంచి చేసిన పోరాటానికి ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవ వేతనం రూ.5,600 నిర్ణయిస్తూ గతేడాది అక్టోబర్‌లో జీఓ 113 జారీ చేశారు. అదే ఏడాది ఆగస్టు నుంచి అమలులోకి వచ్చేలా ఆదేశాలు ఇచ్చారు. జీఓ ఇచ్చిన వెంటనే ఆశ వర్కర్లందరినీ విజయవాడకు పిలిపించి వారితో గ్రూప్‌ ఫొటోలు దిగి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞులై ఉండాలని వారితో ప్రమాణాలు కూడా చేయించుకున్నాయి. అయితే ఇప్పటివరకూ జీఓ అమలుకు నోచుకోలేదు. వీరికి రూ.3 వేలు వేతనం, మరో రూ.3 వేలు పనికి తగ్గ పారితోషికాన్ని గతేడాది డిసెంబర్‌ వరకు మాత్రమే చెల్లించారు. ప్రస్తుతం జనవరి, ఫిబ్రవరి నెలలకు వేతన బకాయిలు ఉన్నాయి. జీఓ వెంటనే అమలు చేయడంతో పాటు పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని జిల్లావ్యాప్తంగా రెండు రోజుల క్రితం పీహెచ్‌సీల వద్ద ఆశా వర్కర్లు ఆందోళన చేసినా స్పందన లేదు.

2006లో విధుల్లో చేరిన ఆశా వర్కర్లు
జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ కింద ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక ఆశావర్కర్‌ని 2006లో ప్రభుత్వం నియమించింది. వీరికి గౌరవ వేతనం నిర్ణయించలేదు. పనికి తగ్గ వేతనం కింద రూ.1,000 చెల్లించేవారు. ఆశావర్కర్లు పోరాటాల ఫలితంగా రూ.3 వేలు గౌరవ వేతనం, పనికి తగ్గ పారితోషికం కింద రూ.5,600 చెల్లించేలా గతేడాది ప్రభుత్వం జీఓ ఇచ్చింది. అయితే ఇది అమలుకు నోచుకోలేదు. జిల్లాలో విలీన మండలాలతో కలుపుకుని 3,490 మంది ఆశావర్కర్లు పనిచేస్తున్నారు.

ఆశావర్కర్ల విధులు
గ్రామాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎం, అదనపు ఏఎన్‌ఎంలకు సహాయకులుగా ఉంటూ ఆశా వర్కర్‌ తన పరిధిలోని వెయ్యి మంది ఆరోగ్య పరిరక్షణ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి. గర్భిణుల నమోదు, వారికి వ్యాధి నిరోధక టీకాలు వేయించడం, ప్రసవ సమయంలో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించడం, ప్రమాదకర పరిస్థితిలో ఉన్న గర్భిణిని ఏరియా ఆసుపత్రికి తరలించడం, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు ఎక్కువగా జరిగేలా ప్రోత్సహించడం, చంటి పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించడం, జాతీయ ఆరోగ్య మిషన్‌పై అవగాహన కల్పించడం, వ్యాధులపై, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం తదితర పనులను చేయాల్సి ఉంటుంది. ఆశా వర్కర్లలో ఏఎన్‌ఎం శిక్షణ పొందిన వారు సైతం ప్రభుత్వం ఏఎన్‌ఎం, అదనపు ఏఎన్‌ఎం పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పిస్తారనే ఆశతో చాలీచాలని వేతనంతో చాలా మంది పనిచేస్తున్నారు.

వీరి డిమాండ్లు
దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే తమకు ఉద్యోగ భద్రత లభించేదని ఆశా వర్కర్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం గౌరవ వేతనం, పనికి తగ్గ వేతనం ఏ నెలకు ఆ నెల ఆశ వర్కర్ల బ్యాంక్‌ ఖాతాల్లో జమచేయాలి. అర్హతలున్న ఆశ వర్కర్లకు ఏఎన్‌ఎం, అదనపు ఏఎన్‌ఎం పోస్టుల భర్తీలో రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించి ప్రాధాన్యత కల్పించాలి. రూ.5 లక్షలు బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలి. గతేడాది ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉన్న టీఏ, డీఏలు చెల్లించాలి. 2015 నుంచి 104 వాహనంపై పనిచేసినందుకు పారితోషికం బకాయిలు, యవ్యాధి కేసులకు వైద్యం చేసినందుకు పారితోషికం ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు