ఎన్జీవో ఎన్నికల్లోనూ ‘ఏబీవీ’ జోక్యం

2 Apr, 2019 05:25 IST|Sakshi

సెక్రటరీ జనరల్‌ పోస్టు నియామకం ఆపాలంటూ బెదిరింపు

తెల్లవారుజామున మూడు గంటల వరకూ ఎన్జీవో నేతలకు ఫోన్లు

సీఎం చెప్పిన వారికే ఇవ్వాలంటూ తీవ్ర ఒత్తిడి

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఒత్తిళ్లకు నివ్వెరబోయిన ఉద్యోగులు

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుకు తాబేదారులా మారిన ఇంటెలిజెన్స్‌ మాజీ బాస్‌ ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) ఆ పోస్టులో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇంటెలిజెన్స్‌ బాస్‌గా తాను చేయాల్సిన ఉద్యోగం మానేసి అధికారపార్టీకి వత్తాసు పలుకుతూ ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు నుంచి డేటా లీకేజీ వరకూ బరితెగించి చేయడం.. చివరకు ఎన్నికల సంఘం ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తప్పించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌ బాస్‌గా ఆయన అరాచకాలు, ఒత్తిళ్లు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సీఎం అండ చూసుకుని ప్రతి పనిలో ఆయన వేలు పెట్టినట్టు విదితమవుతోంది. ఈ క్రమంలో 2 నెలలక్రితం రాష్ట్రంలో జరిగిన నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌(ఎన్జీవో) ఎన్నికలను సైతం ఆయన వదల్లేదని తాజాగా బయటపడింది. ఈ ఎన్నికల్లో ఉద్యోగులను బెదిరించి, సీఎం చెప్పినట్టు చేయాలని ఏబీవీ ఒత్తిడి తెచ్చినట్టు వెల్లడైంది. ఉద్యోగుల నిర్ణయం మేరకు ఎన్నిక జరగకూడదని, సీఎం చెప్పినవారు.. సీఎంకు అనుకూలంగా ఉండేవారే నాయకుడుగా ఉండాలని ఫోన్‌లో ఒత్తిడి తెచ్చారని తెలిసింది.  

సీఎం సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయాలంటూ ఒత్తిడి..
దాదాపు 2 నెలలక్రితం ఏపీ ఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న అశోక్‌బాబు పదవి నుంచి తప్పుకోవడంతో ఎన్జీవో ఎన్నికలకు తేదీ ఖరారు చేశారు. ఎన్నికలు జరగడానికి ఒకరోజు ముందు ఇంటెలిజెన్స్‌ బాసు కొంతమంది ఎన్జీవో నేతలకు ఫోన్‌ చేసి.. కావాలంటే అధ్యక్షుడు, మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకోండి గానీ, సెక్రటరీ జనరల్‌ పోస్టుకు మాత్రం సీఎం సామాజికవర్గానికి చెందిన పశ్చిమ, కృష్ణా బాధ్యతలు చూస్తున్న నాయకుడిని ఎంపిక చేయాలని, లేదంటే ఖాళీగా ఉంచాలని కోరారు. కీలకమైన ఆ పోస్టును ఎలా ఖాళీగా ఉంచుతామని, అలా చేయడానికి వీల్లేదని ఎన్జీవో నేతలు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌తో చెప్పారు. అయినప్పటికీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌  తెల్లవారుజాము 3 గంటల వరకూ ఫోన్లు చేస్తూనే ఉన్నారని, అలా కుదరదని ఎంతగా చెప్పినా బెదిరింపు ధోరణిలో మాట్లాడారని కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు తాజాగా వెల్లడించారు. సీఎం నియమించాలనుకున్న వ్యక్తి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ముందురోజు సీఎం చంద్రబాబు వద్ద సుమారు 3 గంటలపాటు సమావేశమయ్యారని, ఆ తర్వాత ఎన్జీవో ఎన్నికలపై దృష్టి సారించి బెదిరింపులకు దిగారని పలువురు ఉద్యోగులు తెలిపారు. కానీ సీఎంగానీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ గానీ చెప్పినట్టుగా చెయ్యలేమని, మెజారిటీ ఉద్యోగుల నిర్ణయాన్ని బట్టే ఉంటుందని స్పష్టం చేసిన ఉద్యోగులు.. చివరకు తాము నిర్ణయించిన వారినే సెక్రటరీ జనరల్‌గా నియమించారు.

సచివాలయ ఎన్నికల్లోనూ జోక్యం
సీఎం స్థాయి వ్యక్తితోపాటు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌... చివరకు 2 వేల మంది కూడా లేని సచివాలయ ఉద్యోగుల ఎన్నికల్లోనూ జోక్యం చేసుకున్నారంటే ఎంతగా దిగజారారో అర్థం చేసుకోవచ్చు. సచివాలయ ఉద్యోగుల సంఘానికి మురళీకృష్ణ, కె.వెంకటరామిరెడ్డి అధ్యక్ష స్థానానికి పోటీపడ్డారు. ప్రభుత్వానికి మురళీకృష్ణ అనుకూలంగా ఉన్నారని, వెంకటరామిరెడ్డి వ్యతిరేకంగా ఉన్నారన్న విషయాన్ని ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీఎంకు నివేదించారు. దీంతో సీఎం చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని మంత్రి ఆదినారాయణరెడ్డితోపాటు పోటీచేసిన ఇద్దరు నాయకులను తన చాంబర్‌కు పిలిపించుకున్నారు. ఈ చర్చల్లో స్వయానా ముఖ్యమంత్రే.. వెంకటరామిరెడ్డిని నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. దీనికి వెంకటరామిరెడ్డి ససేమిరా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో ఉంటానని, తన నిర్ణయంలో మార్పు ఉండబోదని కుండబద్దలు కొట్టేశారు. తన మాట వినలేదన్న ఉక్రోషంతో కొంతమంది మంత్రుల్ని సీఎం రంగంలోకి దించి ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేసి వెంకటరామిరెడ్డిని ఓడించేలా చక్రం తిప్పారు. ఈ వ్యవహారం తెలుసుకున్న ఉద్యోగులు నిర్ఘాంతపోయారు. ఒక ముఖ్యమంత్రి పాలనా వ్యవహారాలు వదిలేసి, సచివాలయ ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదని, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌కు ఈ ఎన్నికలతో ఏం పని ఉందని వారు మండిపడ్డారు. ఆ తర్వాత వెంకరామిరెడ్డిని అకారణంగా సస్పెండ్‌ చేసిన విషయమూ తెలిసిందే. 

ఇంకా ఏబీవీకే రిపోర్ట్‌ చేస్తున్నారు
హైకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్‌  
ఇంటెలిజెన్స్‌ డీజీ పోస్టు నుంచి ఏబీ వెంకటేశ్వరరావును తప్పించినా.. ఇంటెలిజెన్స్‌ అధికారులు, ఇతర పోలీసులు ఆయనకే రిపోర్ట్‌ చేస్తున్నారని, అలా చేయకుండా ఆ అధికారుల్ని నిరోధించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవట్లేదంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్‌ నాగిరెడ్డి సోమవారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇంటెలిజెన్స్‌ అధికారులు, పోలీసులు ఏబీకే రిపోర్ట్‌ చేస్తుండటం వల్ల ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగే అవకాశం ఉండబోదని, అందువల్ల అతనికి రిపోర్ట్‌ చేయకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వంతోపాటు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆయన కోరారు. అలాగే ఎన్నికల ప్రక్రియలో ఏరకంగానూ జోక్యం చేసుకోకుండా ఏబీని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. క్షేత్రస్థాయిలోనూ ఎలాంటి సమాచారాన్ని, నివేదికను ఏబీకి సమర్పించకుండా, ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్నప్పుడు వచ్చిన నివేదికలను ఉపయోగించకుండా అతన్ని నిరోధించాలని కోరారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీజీ, ఎన్నికల సంఘం కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. అలాగే ఏబీ వెంకటేశ్వరరావును వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. 

అధికార దుర్వినియోగమే: ఏబీతోపాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలు అధికార టీడీపీ కోసం పనిచేస్తున్న నేపథ్యంలో వారిపై వైఎస్సార్‌సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని, దాని ఆధారంగా ఆ ముగ్గురిని తప్పిస్తూ ఈసీ ఉత్తర్వులిచ్చిందని నాగిరెడ్డి తెలిపారు. అయినప్పటికీ ఎన్నికలు, రాజకీయపార్టీలకు సంబంధించి సేకరించిన సమాచారమంతటినీ ఏబీవీకి తెలియచేయాలని పోలీసు అధికారులందరికీ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారని, దీంతో వారంతా వాట్సాప్‌ ద్వారా సమాచారాన్ని ఏబీవీకి ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని వివరించారు. వాస్తవానికి ఇంటెలిజెన్స్‌ బాస్‌గా మరో అధికారి నియమితులయ్యారని, అయినప్పటికీ ఏబీ కే రిపోర్ట్‌ చేయాలనడం అధికార దుర్వినియోగమేనన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని నాగిరెడ్డి కోర్టును అభ్యర్థించారు. 

>
మరిన్ని వార్తలు