జిల్లా అధికారులకు ‘ఏబీసీడీ’ అవార్డులు

17 May, 2018 10:42 IST|Sakshi
డీజీపీ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న  ఎస్సీ,ఎస్టీ సెల్‌ డీఎస్పీ  త్రినాథ్‌ 

విజయనగరం టౌన్‌: సమర్థవంతంగా కేసులను దర్యాప్తు చేసే అధికారులకు డీజీపీ ఇచ్చే ‘ఏబీసీడీ’ (అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ ఇన్‌ క్రైమ్‌ డిటెక్షన్‌) అవార్డులు జిల్లాకు చెందిన ముగ్గురు పోలీస్‌ అధికారులకు దక్కాయి. ఈ మేరకు డీజీపీ ఎం. మాలకొండయ్య చేతులమీదుగా మంగళగిరిలో ఉన్న డీజీపీ కార్యాలయంలో ఎస్సీ,ఎస్టీ సెల్‌ డీఎస్పీ టి.త్రినాథ్, బొబ్బిలి డీఎస్పీ పి.సౌమ్యలత, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ జి.రామకృష్ణ బుధవారం అవార్డులు అందుకున్నారు.

పోలీస్‌ శాఖలో ప్రతిష్టాత్మకంగా భావించే ఏబీసీడీ అవార్డ్స్‌ ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాకే లభించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామం వద్ద నిర్జన ప్రదేశంలో పూసపాటిరేగ మండలానికి చెందిన షెడ్యూల్డ్‌ కులానికి చెందిన ఒక దివ్యాంగురాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ పాలరాజు దర్యాప్తు బాధ్యతలను ఎస్సీ,ఎస్టీ సెల్‌ డీఎస్పీ టి. త్రినాథ్‌కు అప్పగించారు.

బాధితురాలు మహిళ అయినందన  దర్యాప్తులో సహకరించాల్సిందిగా బొబ్బిలి డీఎస్పీ పి.సౌమ్యలతను, అలాగే  అవసరమైన సహాయ, సహకారాలందించేందుకు స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ జి.రామకృష్ణలను ఆదేశించారు. అయితే ఇంటికి ఆలస్యంగా చేరడంతో కుటుంబ సభ్యులు మందలిస్తారని భయపడి తప్పుడు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పడంతో అంతరూ ఊపిరిపీల్చుకున్నారు.

కేసుకు సంబంధించి వాస్తవాలను వెలికితీయడంతో పోలీస్‌ అధికారులకు ఏబీసీడీ అవార్డులు దక్కాయి. ఈ మేరకు అవార్డులు అందుకున్న ఎస్సీ,ఎస్టీ సెల్‌ డీఎస్పీ టి.త్రినాథ్, బొబ్బిలి డీఎస్పీ పి.సౌమ్యలత, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ జి.రామకృష్ణలను  జిల్లా ఎస్పీ పాలరాజు, ఓఎస్‌డీ విక్రాంత్‌ పాటిల్, అదనపు ఎస్పీ ఏవీ.రమణ  జిల్లా పోలీసు అధికారులు అభినందించారు.

మరిన్ని వార్తలు