ఐసెట్‌లో 90.27 శాతం ఉత్తీర్ణత

9 May, 2019 04:34 IST|Sakshi
1వ ర్యాంక్‌ నాగ సుమంత్, 2వ ర్యాంక్‌ కావ్యశ్రీ

అబ్బాయిలు 90.07 శాతం,అమ్మాయిలు 90.50% ఉత్తీర్ణత

గుంటూరుకు చెందిన నాగసుమంత్‌కు ప్రథమ ర్యాంకు

రెండో ర్యాంకు సాధించిన తుని విద్యార్థిని కావ్యశ్రీ

వెబ్‌సెట్‌లో ఐసెట్‌ ఫలితాలు..

15 నుంచి ర్యాంక్‌ కార్డులు

సాక్షి, అమరావతి: ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఐసెట్‌–2019 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.విజయరాజు, ఎస్వీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ వీవీఎస్‌ రాజేంద్రప్రసాద్‌ ఫలితాలను విజయవాడలో విడుదల చేశారు. కార్యక్రమంలో ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎం.శ్రీనివాసరెడ్డి, ప్రొఫెసర్‌ బి.సుధీర్‌ పాల్గొన్నారు. 43 పట్టణాల్లోని 98 పరీక్ష కేంద్రాల్లో గత నెల 26న ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 52,736 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 48,445 మంది పరీక్ష రాశారు. వీరిలో 43,731 (90.27 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో పురుషులు 26,002, మహిళలు 22,443 మంది ఉన్నారు. ఉత్తీర్ణతలో మహిళలు 90.50 శాతం, పురుషులు 90.07 శాతం సాధించారు. గుంటూరుకు చెందిన కె.నాగసుమంత్‌ మొదటి ర్యాంక్‌ సాధించగా, తునికి చెందిన కె.కావ్యశ్రీ రెండో స్థానంలో నిలిచారు. ఫలితాలను ‘హెచ్‌టీటీపీఎస్‌://ఎస్‌సీహెచ్‌ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌/ఐసీఈటీ’లో చూసుకోవచ్చు. ర్యాంకు కార్డులను ఈనెల 15వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

టాప్‌ టెన్‌ ర్యాంకర్లు వీరే
ర్యాంక్‌    పేరు    ఊరు
1    కె.నాగసుమంత్‌    గుంటూరు
2    కె.కావ్యశ్రీ    తుని    
3    ఎన్‌ఎన్‌వి శివసాయిపవన్‌    విజయవాడ
4    వై.మునిచంద్రారెడ్డి    వేంపల్లె (కడప)
5    ఓ.భానుప్రకాశ్‌    పుత్తూరు (చిత్తూరు)
6    ఎం.వెంకట నాగేంద్ర    విశాఖపట్నం
7    పీవీ లక్ష్మీకిరణ్మయి    రాజమండ్రి
8    కె.భానుప్రకాశ్‌రెడ్డి పి.నాయుడుపేట (చిత్తూరు)
9    అనెమ్‌ అఖిల్‌    మల్కాజ్‌గిరి (హైదరాబాద్‌)
10    ఎ.సురేంద్రరెడ్డి (బేతంచర్ల, కర్నూలు)

సీట్లు ఇలా..
ఎంబీఏ కాలేజీలు 354 ఉండగా 43,809 సీట్లు ఉన్నాయి. ఎంసీఏ కాలేజీలు 131 ఉండగా 8,665 సీట్లు ఉన్నాయి. ఎంసీఏలో రెండో సంవత్సరం సీట్లు 4,412 ఉన్నాయి.

ఐపీఎస్‌ కావడమే లక్ష్యం
మాది గుంటూరు నగర శివారు గోరంట్ల. మా నాన్నగారు చిన్నప్పస్వామి పంచాయతీరాజ్‌ శాఖలో డివిజినల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పని చేస్తూ మరణించారు. నాన్న లక్ష్యం మేరకు మా అమ్మ బసవ సరోజిని ప్రోత్సాహంతో ఈ స్థాయికి వచ్చా. 2017లో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాను. ఆరు నెలలపాటు ఆంధ్రాబ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేశాను. ఐపీఎస్‌గా ఎదగాలనే లక్ష్యంతో రాజీనామా చేశాను. ఏయూలో ఎంబీఏలో చేరతాను. తరువాత సివిల్స్‌ లక్ష్యంగా ఐపీఎస్‌ సాధిస్తాను.
– కారుమూరి నాగసుమంత్, ప్రథమ ర్యాంకర్‌

నా గోల్‌ సివిల్స్‌
సివిల్‌ సర్వీసెస్‌ నా లక్ష్యం. ఇంటివద్దే ప్రిపేరయ్యాను. ఎలాంటి కోచింగ్‌ తీసుకోని నాకు ‘సాక్షి’ ఎడ్యుకేషన్‌ వెబ్‌ పోర్టల్‌ బాగా ఉపయోగపడింది. మంచి కాలేజీలో ఎంబీఏ జాయిన్‌ అవుతాను. బీటెక్‌ పూర్తిచేసి విజయవాడ రైల్వే స్టేషన్‌ మాస్టర్‌గా పనిచేస్తున్నాను. మా తండ్రి ఎన్‌ఎం రామయ్య గన్నవరం మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నారు. మా అమ్మ పద్మజ గృహిణి. వీరి ప్రోత్సాహం వల్లే నేను అనుకున్న టార్గెట్లను చేరుకోగలుగుతున్నాను.
– నరహరిశెట్టి ఎన్‌వీ శివసాయిపవన్, మూడో ర్యాంకర్‌

మరిన్ని వార్తలు