‘పురుషోత్తపట్నం’ పనుల్లో రూ.50.89 కోట్లు ఆదా

25 Feb, 2020 04:26 IST|Sakshi

రూ.1,627.04 కోట్ల నుంచి రూ.1,576.15 కోట్లకు తగ్గిన పనుల వ్యయం 

సాక్షి, అమరావతి: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి డిజైన్లలో మార్పులను ఆమోదించడం.. పునర్‌ వ్యవస్థీకరించిన షెడ్యూల్డ్‌ ఆఫ్‌ రేట్స్‌ (ఎస్‌వోఆర్‌)ను వర్తింప చేయడంతో ఖజానాకు రూ.50.89 కోట్లను ప్రభుత్వం ఆదా చేసింది. దీంతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పనుల కాంట్రాక్ట్‌ ఒప్పంద వ్యయాన్ని రూ.1,627.04 కోట్ల నుంచి.. రూ.1576.15 కోట్లకు తగ్గిస్తూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోదావరి ఎడమ గట్టు నుంచి రోజుకు 3,500 క్యూసెక్కుల చొప్పున పోలవరం ఎడమ కాలువలోకి ఎత్తిపోసి.. పోలవరం ఎడమ కాలువ 57.88 కిమీ వద్ద నుంచి ఏలేరు రిజర్వాయర్‌లోకి వెయ్యి క్యూసెక్కులు ఎత్తిపోసేందుకు చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను 2017 జనవరి 30వ తేదీన 4.55 శాతం అధిక ధరకు రూ.1,627.04 కోట్లకు సర్కార్‌ అప్పగించింది.

నిర్దేశించిన గడువులోగా ఈ పనులను కాంట్రాక్ట్‌ సంస్థ పూర్తి చేసింది. పంప్‌ హౌస్, డైవర్షన్‌ రోడ్డు, డెలివరీ సిస్టం, క్రాస్‌ రెగ్యులేటర్, ఆఫ్‌ టేక్‌ వంటి పనుల డిజైన్లు మారాయి. వాటిని సర్కార్‌ ఆమోదించింది. డిజైన్ల మార్పుల వల్ల వాటి పనుల అంచనా వ్యయం రూ.6.68 కోట్ల మేర తగ్గుతుందని ఐబీఎం (అంతర్గత అంచనా విలువ) కమిటీ, ఎస్‌ఎల్‌ఎస్‌సీ (స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ) అంచనా వేశాయి. సర్కార్‌ ఆదేశాల మేరకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పనులకు పునర్‌ వ్యవస్థీకరించిన ఎస్‌వోఆర్‌ను వర్తింప చేయడం వల్ల పనుల వ్యయం రూ.44.21 కోట్లు తగ్గుతుందని స్పష్టం చేస్తూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు నివేదిక ఇచ్చాయి. ఆ నివేదికపై సర్కార్‌ ఆమోద ముద్ర వేయడంతో ఖజానాకు రూ.50.89 కోట్లు ఆదా అయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక విధానం రివర్స్‌ టెండరింగ్‌ వల్ల రూ.1,920.40 కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదా అయ్యాయి.  

>
మరిన్ని వార్తలు