స్మార్ట్‌ ఫోన్లలోనూ ‘రివర్స్‌’ జోరు

4 Dec, 2019 03:55 IST|Sakshi

రూ. 83.80 కోట్ల ప్రజాధనం ఆదా

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు 2.64 లక్షల ఫోన్ల కొనుగోలు

తొలిసారి టెండర్‌లో ఎల్‌-1గా నిలిచిన సంస్థ కోట్‌ చేసిన మొత్తం (రూ.కోట్లలో..) 317.61 

రివర్స్‌ టెండరింగ్‌లో మరో సంస్థ కోట్‌ చేసిన మొత్తం (రూ. కోట్లలో..) 233.81

26.4 % తక్కువ ధరతో నెరవేరిన సర్కారు లక్ష్యం

ఇప్పటి వరకు వివిధ పనుల్లో ఆదా అయిన మొత్తం (రూ. కోట్లలో) 1,418.66

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న విప్లవాత్మక విధాన పరమైన రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ ద్వారా భారీగా ప్రజా ధనం ఆదా అవుతోంది. తాజాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల కోసం స్మార్ట్‌ ఫోన్లు కొనుగోలుకు సంబంధించిన రివర్స్‌ టెండరింగ్‌లో రూ.83.80 కోట్ల ప్రజా ధనం ఆదా అయింది. ప్రజలకు వేగంగా సేవలు అందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్‌ ఫోన్లు కొనుగోలు చేయాలని నిర్ణయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల 30వ తేదీన 2,64,920 స్మార్ట్‌ ఫోన్ల కోసం దాఖలైన టెండర్లలో రూ.317.61 కోట్లు కోట్‌ చేస్తూ ఒక సంస్థ ఎల్‌-1గా నిలిచింది.

ఈ సంస్థ కోట్‌ చేసిన ధరపై ఈ నెల 2వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏపీటీఎస్‌) రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించింది. ఇందులో మరో సంస్థ రూ.233.81 కోట్లు కోట్‌ చేసి ఎల్‌ృ1గా నిలిచింది. దీంతో రివర్స్‌ టెండరింగ్‌కు ముందు ఎల్‌-1గా నిలిచిన సంస్థ కోట్‌ చేసిన ధర కంటే ఇది రూ.83.80 కోట్లు తక్కువ. ఈ మేరకు 26.4 శాతం ప్రజా ధనం ఆదా అయింది. కాగా, 3జీబీ రామ్, 32 జీబీ మెమొరీ, ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో పాటు రిమోట్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్, యూఎస్‌బీ కన్వర్టర్, టెంపర్డ్‌ గ్లాస్, బ్యాక్‌ కవర్‌తో కూడిన ఈ ఫోన్లకు మూడు సంవత్సరాల సర్వీసు అందిస్తారు.  

>
మరిన్ని వార్తలు