ప్రైవేట్ దోపిడీ!

13 Jan, 2016 23:29 IST|Sakshi
ప్రైవేట్ దోపిడీ!

అమాంతం పెరిగిన ప్రైవేట్ బస్సుల చార్జీలు
సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకుంటున్న ఆపరేటర్లు
సామాన్యులకు భారంగా మారిన ప్రయాణం
పట్టించుకోని అధికార యంత్రాంగం

 
విశాఖ నుంచి బెంగళూరు.. రూ.4వేలు, చెన్నై.. రూ.3500, హైద రాబాద్.. రూ.3వేలు.. ఈ రేట్లు చూసి విమాన చార్జీలు అనుకునేరు!.. ఇవన్నీ బస్సు చార్జీలే.. పండుగ సీజనులో ప్రైవేట్ ట్రావెల్స్‌వారు వసూలు చేస్తున్న ఈ చార్జీలు చూస్తే.. దొరికనప్పుడే దండుకోవాలన్న వారి దోపిడీ విధానం అర్థమవుతుంది. సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకునేం దుకు సాధారణ రోజుల్లో ఉండేచార్జీలను రెండుమూడింతలు పెంచేశారు.
 
విశాఖపట్నం: సంక్రాంతి అంటే పెద్ద పండుగ. దీన్ని జరుపుకోవడానికి దూరతీరాల్లో ఉన్న వారందరూ ఎలాగైనా స్వగ్రామాలకు వెళ్లాలని తాపత్రయపడటం సహజం. ఫలితంగా ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగి రైళ్లు, విమానాలు కిటకిటలాడుతున్నాయి. ఇదే అదనుగా ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు దోపిడీకి సిద్ధపడి.. చార్జీలను అమాంతం పెంచేశారు. సాధారణ రోజుల్లో వసూలు చేసే చార్జీల కంటే రెండింతులకుపైగా వసూలు చేస్తున్నారు. విద్యాసంస్థలకు ఇప్పటికే సంక్రాంతి సెలవులు ఇచ్చేశారు. ఇక శుక్రవారం సంక్రాంతి, ఆపై శని, ఆదివారాలు మెజారిటీ ఉద్యోగులకు సెలవు కావడంతో వేల సంఖ్యలో ప్రజలు ఒకేసారి ప్రయాణాలు పెట్టుకున్నారు. నగరం నుంచి స్వగ్రామాలకు వెళ్లడానికి కుటుంబాలతో రైలు, బస్సుస్టేషన్లకు పోటెత్తుతున్నారు. అక్కడ టికెట్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు.  అయితే ఆపరేటర్లు చెబుతున్న ధరలు వారికి దడ పుట్టిస్తున్నాయి. విశాఖ నుంచి కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, తిరుపతి, చెన్నై, బెంగుళూరు, తదితర ప్రాంతాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. అయినా తప్పనిసరై ప్రైవేట్ బస్సుల్లో వెళ్లడానికి ప్రజలు సిద్ధపడుతున్నారు. దీంతో ప్రైవేట ట్రావెల్స్ పంట పండుతోంది. గ్యారేజీలకు పరిమితమైన బస్సులను కూడా రోడ్డు మీదికి తెచ్చి తిప్పేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడపడమే కాకుండా ఇష్టానుసారం చార్జీలు వసూలు చేస్తున్నా సంబంధిత అధికారులు నోరు మెదపడం లేదు.

ఆర్టీసీదీ అదే రూటు: ప్రైవేట్ ట్రావెల్స్ బాటలోనే ఆర్టీసీ కూడా దోపిడీకి పాల్పడుతోంది. పండుగ రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు నడుపుతున్నామంటూనే.. ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారు. అదే సమయంలో గ్రామీణ రూట్లలో తిరిగే పల్లెవెలుగు, ఇతర డొక్కు బస్సులను ప్రత్యేక సర్వీసులుగా నడుపుతున్నారు. దీంతో సామాన్య ప్రయాణికులు లబోదిబోమంటున్నారు.
 

మరిన్ని వార్తలు