ముఖం చాటేసిన తమ్ముళ్లు!

28 May, 2016 00:44 IST|Sakshi
ముఖం చాటేసిన తమ్ముళ్లు!

అధికార తెలుగుదేశం పార్టీ తిరుపతిలో అట్టహాసంగా మహానాడును ప్రారంభించింది. ఈ కార్యక్రమం అంటే ఎంతో ఉత్సాహంగా హాజరయ్యే తెలుగు తమ్ముళ్లు జిల్లా నుంచి నామమాత్రంగానే తరలివెళ్లారు. దీనికి ప్రధాన కారణం గ్రూపు తగాదాలేననేది బహిరంగ రహస్యం. పాస్‌లు వచ్చినవారంతా వెళ్లారని జిల్లా నాయకులు చెబుతున్నా ద్వితీయ శ్రేణిలో చాలామంది డుమ్మాకొట్టినట్లు సమాచారం.
 
టీడీపీ మహానాడుకు డుమ్మా!
* ఇచ్ఛాపురంలో ఏఎంసీ చిచ్చు
* మిగతాచోట్ల గ్రూపుల గొడవ
* జిల్లా నుంచి నామమాత్ర హాజరు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తొలినుంచి టీడీపీకి కంచుకోట అని పేరొందిన ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది కార్యకర్తలు మహానాడు కార్యక్రమానికి వెళ్లేవారు. ఇచ్ఛాపురం పట్టణం నుంచి కూడా 50 మందికి తక్కువ కాకుండా హాజరయ్యేవారు.  

ఈసారి మాత్రం స్థానికంగా పదవుల కేటాయింపులతో తలెత్తిన వివాదాలు, గ్రూపు రాజకీయాలతో తమ్ముళ్లు చాలామంది అలకపాన్పు ఎక్కారు. ఇచ్ఛాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవిని పట్టణానికి చెందిన నేతలకు కాకుండా రూరల్ ప్రాంతానికి  చెందిన సాడి సహదేవ్‌రెడ్డికి కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ కార్యక్రమాలకు పట్టణ క్యాడర్ కొన్నాళ్లుగా దూరం పాటిస్తోంది.  దాదాపుగా ముఖ్య నాయకులు చాలామంది మహానాడు కార్యక్రమానికి సైతం హాజరుకాలేదని తెలిసింది. వారిలో ఇచ్ఛాపురం పట్టణ టీడీపీ అధ్యక్షుడు కె.ధర్మారావు, మరో ముఖ్యనేత జగన్నాథరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు అంబటి లింగరాజు, జిల్లా పార్టీ నాయకుడు చాట్ల తులసీదాస్‌రెడ్డి ఉన్నారు.

ఈ విషయమై స్థానిక టీడీపీ కార్యకర్తలు ఆరా తీస్తే... శనివారం నాటి కార్యక్రమానికి హాజరవుతున్నారని కొంతమంది సర్దిచెబుతున్నట్లు సమాచారం. అలాగే నరసన్నపేట నియోజకవర్గం నుంచి గతంలో క్రమం తప్పక మహానాడుకు హాజరైన కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఈసారి వెళ్లలేదు. నరసన్నపేట మండలాధ్యక్షురాలు పార్వతమ్మ, సర్పంచ్ జి.చిట్టిబాబు కూడా ఉండటం చర్చనీయాంశమైంది. పలాస నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో టిక్కెట్ ఆశించిన మద్దిల చిన్నయ్య కూడా ఈసారి మహానాడుకు దూరంగా ఉన్నారు.
 
గ్రూపులుగా విడిపోయి
టీడీపీలో మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, ఇతర ఎమ్మెల్యేల మధ్యనున్న గ్రూపు తగాదాలు మహానాడు కార్యక్రమంలోనూ కనిపించాయి. నియోజకవర్గంలో అంతా ఒక్కరిగా గాకుండా గ్రూపులుగా విడిపోయి తిరుపతి ప్రయాణమయ్యారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో అచ్చెన్న గ్రూపు, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గ్రూపు వేర్వేరుగానే వెళ్లారు. అయితే ఈ రెండు గ్రూపుల్లోనూ ఉన్న కళింగ కోమటి సామాజికవర్గం నేతలు మాత్రం ఒకే బృందంగా వెళ్లడం మారుతున్న రాజకీయ పరిణామాలకు అద్దం పట్టింది.

గుండ లక్ష్మీదేవి భర్త, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రెండ్రోజుల క్రితం పార్టీ సమావేశానికి హాజరుకావడం, రాబోయే శ్రీకాకుళం నగరపాలకసంస్థ ఎన్నికలలో మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారనే ప్రచారం నేపథ్యంలో కళింగ కోమటి సామాజిక వర్గం నాయకులు ఏకతాటిపైకి వస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే రాజాం నియోజకవర్గంలో కూడా కళావెంకటరావు గ్రూపు, ఎమ్మెల్సీ ప్రతిభాభారతి గ్రూపులను మహానాడు ఏకం చేయలేకపోయింది. పాతపట్నంలోనూ మూడు గ్రూపులదీ అదే పరిస్థితి.

ఎంపీ రామ్మోహన్నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడుల గ్రూపు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు గ్రూపులకు ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గ్రూపు తోడయ్యింది. ఎంపీ, మంత్రిల గ్రూపు, ఎమ్మెల్యే కలమట గ్రూపు ఒకే మాటపై ఉండటంతో అసహనంతో ఉన్న శత్రుచర్ల గ్రూపు ఈసారి మహానాడుకు వెళ్లరనే ప్రచారం జరిగింది. అయితే ఆఖరి నిమిషంలో కొంతమంది బయల్దేరి వెళ్లారని తెలిసింది.

మరిన్ని వార్తలు