అబూసలేం దోషి

19 Nov, 2013 02:04 IST|Sakshi
అబూసలేం దోషి

సాక్షి, హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్టు కేసులో మాఫియా డాన్ అబూసలేంను దోషిగా  సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది.  అబూసలేంకు విధించే శిక్ష ఈనెల 28న ఖరారవుతుందని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రమణ నాయుడు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో 39 మంది సాక్షుల వాంగ్మూలాలను, 60 డాక్యుమెంట్లను పరిశీలించి అనంతరం, భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని 420, 419, 471, 468 రెడ్‌విత్ 120(బి) సెక్షన్ల కింద అబూసలేంను దోషిగా నిర్ధారించినట్టు కోర్టు సోమవారం పేర్కొంది. కర్నూలు చిరునామాతో రమిల్‌కమిల్ మాలిక్ అన్న పేరుతో  అబూసలేం, అతని భార్య సమీరాజుమానీ, ప్రియురాలు సినీ నటి మోనికాబేడీ  2001లో నకిలీ పాస్‌పోర్టులను పొందారు.
 
 అనంతరం వారు పోర్చుగల్‌కు పరారయ్యారు. వారిపై రెడ్‌కార్నర్ నోటీసులు జారీ కావడంతో పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో 2002 సెప్టెంబర్‌లో అక్కడి పోలీసులు వారిని అరెస్టు చేశారు. అనంతరం 2005 నవంబర్ 11న వారిని పోర్చుగల్ నుంచి సీబీఐ అధికారులు మనదేశానికి తీసుకొచ్చారు. ఇదే కేసులో మోనికాబేడీకి కోర్టు గతంలో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. నిందితులుగా ఉన్న కర్నూలు ఎస్పీ కార్యాలయ ఉద్యోగి శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుల్ సత్తార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ యూనస్, పోస్టుమన్ గోకారీ సాహెబ్‌లకు ఇప్పటికే సీబీఐ కోర్టు శిక్ష విధించింది. కేసులో రెండో నిందితురాలైన అబూసలేం భార్య సమీరా జుమానీ ఆచూకీని వరకు సీబీఐ కనిపెట్టదు. దీనితో ఆమెపై విచారణ పెండింగ్‌లో ఉంది. ఇక, ముంబై జైల్లోని అబూసలేంను సోమవారం ప్రత్యేక కోర్టులో హాజరుపర్చాల్సి ఉన్నా...భద్రతా కారణాల రీత్యా హాజరుపర్చలేదు. ఈనెల 28న శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో అబూసలేంను కోర్టులో హాజరుపర్చనున్నారు.

మరిన్ని వార్తలు