అధికార దుర్వినియోగం

4 Jul, 2014 02:39 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: మున్సిపాలిటీ అధికార పీఠాలను దక్కించుకునేందుకు టీడీపీ అధికారాన్ని ఎరగా వేసింది. అధికారాన్ని అడ్డుపెట్టి బెదిరింపులు, నానా రకాలుగా ప్రలోభాలు, అడిగినంత డబ్బు, కావాల్సినన్ని కాంట్రాక్టులు. ‘ఐదేళ్లు అధికారం మనదే. మీరు చెప్పిందే వేదం’ అంటూ నానా రకాల ప్రలోభాలతో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది.
 
 జిల్లాలో గురువారం జరిగిన మున్సిపాలిటీ చైర్‌పర్సన్ల ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు నానా హంగామా సృష్టించారు. ఆత్మకూరులో ఏకంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డిపై దౌర్జ్యన్యానికి దిగారు. నెల్లూరు కార్పొరేషన్ దక్కించుకొనేందుకు చేసిన కుట్రలు ఫలించకపోవడంతో ఎన్నిక సమయంలో కుట్రలకు తెరలేపారు. మేయర్ అభ్యర్థి ఎన్నికను అడ్డుకొనే ప్రయత్నం చేశారు.
 
 అయినా వారికుట్రలను తిప్పికొట్టి  నేతలు నెల్లూరు కార్పొరేషన్‌పై వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేశారు. కావలిలో అధికారం అడ్డుపెట్టి కుయుక్తులు పన్నారు. మొత్తంగా ప్రజాభిప్రాయాన్ని  ఏ మాత్రం గౌరవించక అధికారాన్ని అడ్డుపెట్టి దొడ్డిదారిన అధికారాన్ని పొం దేందుకు టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు దిగారు. పోలీసులు సహజంగానే అధికార పార్టీకి కొమ్ముకాశారు.
 
 అధికార పార్టీ దిగజారుడు రాజకీయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 ఆత్మకూరు మున్సిపాలిటీలో మొత్తం 23 స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీ 10 స్థానాలు, కాంగ్రెస్ 8, టీడీపీ 4, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక్క స్థానంలో విజయం సాధించారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ఒక్కటయ్యాయి. అధికారాన్ని అడ్డుపెట్టి ఇద్దరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకున్నారు. గురువారం ఎన్నిక సందర్భంగా తిరిగి రావాలంటూ ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ సభ్యులను వెనక్కు పిలిచే ప్రయత్నం చేయగా కాంగ్రెస్, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డిపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అధికారానికి మద్దతు పలికి గౌతమ్‌రెడ్డిని అక్కడి నుంచి పంపించారు. అనంతరం ఎన్నిక జరుపుకున్నారు. టీడీపీ మద్దతుతో కాం గ్రెస్ మహిళా కౌన్సిలర్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇక కావలిలోనూ అధికారపార్టీ ,కాంగ్రెస్ కుమ్మక్కై చైర్‌పర్సన్ గిరి దక్కించుకొన్నాయి. ఇక్కడ కూడా ప్రలోభాల పర్వం జోరుగా సాగింది. కావలి మున్సిపాలిటీలో  40 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 21, టీడీపీ 16, కాంగ్రెస్ 2, బీజేపీ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి.
 
 కాంగ్రెస్ ,బీజేపీ సభ్యులు టీడీపీకి మద్దతు పలికారు. దీంతో ఎలాగైనా కావలి మున్సిపాలిటీని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు బీద సోదరులతో పాటు ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, మాగుంట శ్రీనివాసులురెడ్డి తదితరులు ప్రలోభాల పర్వానికి తెరలేపారు. దీంతో చివరి నిమిషంలో అధికార పార్టీ ప్రలోభాల పుణ్యమాని వైఎస్సార్‌సీపీ  నేత యానాదిశెట్టి మరో వైఎస్సార్‌సీపీ సభ్యుడితో కలిసి టీడీపీకి మద్దతు పలకడంతో కావలి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పదవి టీడీపీ వశమైంది.
 
 ఇక నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లోనూ అధికార దుర్వినియోగం అంబరాన్ని తాకింది. మొత్తం 54 మంది సభ్యులున్న కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ 32 స్థానాలు దక్కిం చుకొంది. టీడీపీ, ఇండిపెండెంట్‌తో కలిపి 19 , బీజేపీ రెండు,సీపీఎం ఒక్క స్థానాన్ని దక్కించుకున్నాయి. వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా అధికార టీడీపీ కార్పొరేషన్ తమదేనంటూ నానా హంగామా సృష్టించింది. కార్పొరేటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చే శారు. అయినా సభ్యులెవరూ గెలిపిం చిన పార్టీని, స్థానిక ఎమ్మెల్యేలు అనీల్‌కుమార్ యాదవ్,కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలను కాదని  ప్రలోభాలకు లొంగలేదు.
 
 దీంతో ఓటమి తప్పదని తెలిసినా మేయర్ ఎన్నికకు అవాంతరాలు సృష్టించారు. రాష్ట్రం మొత్తం ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక జరుగుతుండ గా ఇక్కడ మాత్రం రహస్య బ్యాలెట్ విధానంలో జరగాలంటూ  టీడీపీ సభ్యులు పట్టుబట్టి గొడవ సృష్టించారు. దీంతో మేయర్  ఎన్నిక ఆలస్యమైంది. చివరకు కలెక్టర్ శ్రీకాంత్  అధికారపార్టీ వత్తిళ్లకు లొంగక ఎన్నికను నిర్వహించి అబ్దుల్ అజీజ్ మేయర్‌గా ఎన్నికైనట్టు ప్రకటించడంతో ఉత్కంఠతకు తెరపడింది. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్‌గా ముక్కాల ద్వారకానాథ్  ఎన్నిక లాంఛనప్రాయమైంది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సహం వెళ్లివిరిసింది.
 
  ఇక గూడూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక  ఉత్కంఠతకు తెరలేపింది. మున్సిపాలిటీలో మొత్తం 33 మంది సభ్యులకు గాను వైఎస్సార్‌సీపీ 16, టీడీపీ 16 స్థానాలను గెలుపొందగా ఒక్కచోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. అధికార పార్టీ ప్రలోభాల పుణ్యమాని ఇండిపెండెంట్‌తో పాటు మరొక వైఎస్సార్ సీపీ సభ్యుడు సైతం టీడీపీకి మద్దతు పలికారు. తీరా ఒక సభ్యుడు ఏ ఒక్కరికీ మద్దతు పలకలేదు. ఈ లెక్కన వైఎస్సార్‌సీపీకి 15 స్థానాలు మిగిలాయి. ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేలు ఓట్లు వేయడంతో  రెండు పార్టీలకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో డ్రా తీయగా చైర్మన్ పీఠం టీడీపీ పరమైంది. సూళ్లూరుపేట,నాయుడుపేట, వెంకటగిరిలలో టీడీపీ పాగా వేసింది.

మరిన్ని వార్తలు