ఏసీబీకి చిక్కిన కోటేశ్వరుడు

19 Dec, 2014 02:22 IST|Sakshi
ఏసీబీకి చిక్కిన కోటేశ్వరుడు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :గ్రంథాలయాల్లో కూడా లంచాలుంటాయా..చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నవారి నుంచి కూడా ఆమ్యామ్యాలు అడుగుతారా..పీఎఫ్ బకాయి ఇవ్వాలంటే రూ.36 వేలు లంచం ఇవ్వాల్సిందేనా? ఇవీ గురువారం పలువురికి తలెత్తిన ప్రశ్నలు. ఔట్‌సోర్సింట్ ఉద్యోగులకు 40 నెలల బకాయి విడుదల చేయాలంటే తనకు లంచం ఇవ్వాల్సిందేనని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి జలగడుగుల కోటేశ్వరరావు 12 మంది చిరుద్యోగుల నుంచి లంచం డిమాండ్ చేశారు. కోపంతో ఉన్న చిరుద్యోగులు లంచం ఇవ్వకుండా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని కోటేశ్వరరావును గురువారం పట్టుకున్నారు.
 
 కోటేశ్వరరావు పరిధిలో జిల్లాలోని 44 శాఖా గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి. 42 మంది శాశ్వత ఉద్యోగులు, 14 మంది ఇతర విభాగాల ఉద్యోగులున్నారు. అటెండర్, లైబ్రేరియన్లు, రికార్డ్ అసిస్టెంట్లు హర్షా అనే ఏజెన్సీ ద్వారా ఔట్‌సోర్సింగ్ పద్ధతిన కొంతమంది పని చేస్తున్నారు. ఒక్కో ఉద్యోగి నుంచి రూ.4 వేలు చొప్పున లంచం డిమాండ్ చేయగా తామంత ఇచ్చుకోలేమని తెగేసి చెప్పినా కోటేశ్వరరావు వినలేదు. తన సహోద్యోగులకూ డబ్బులివ్వాలని పట్టుబట్టారు. దీంతో రూ.3 వేలు చొప్పున 12 మంది రూ.36 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలివిడతగా రూ.18 వేలు ముట్టజెప్పాలని, పని పూర్తిచేస్తే మిగతా సొమ్ము ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడంతో ఉద్యోగులు విసిగిపోయారు. ఏడాదిన్నర క్రితం జి.సిగడాంలో గ్రంథపాలకుడిగా చేరిన సీహెచ్ వెంకటేశ్ ఏసీబీని ఆశ్రయించడంతో కోటేశ్వరరావు పాపం పడింది.
 ఇదీ జరిగింది..
 
 ఏజెన్సీ ద్వారా నియామకమైన ఉద్యోగులకు తొలుత పీఎఫ్ ఖాతాలు లేవు. దీంతో 40 నెలల సొమ్ము సిబ్బందికి రావాల్సి ఉంది. ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.50 వేలు పైనే పెండింగ్‌లో ఉంది. ఈ సొమ్ము రిలీజ్ చేయాలంటే లంచం ఇవ్వాలని కోటేశ్వరరావు డిమాండ్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. వాస్తవానికి బకాయి సొమ్ము చెక్కు ఇటీవల కార్యదర్శి వద్దకు వచ్చింది. దానిని ఏజెన్సీ నిర్వహకులకు ఇచ్చేయడం కూడా జరిగిపోయింది. అయినా లంచం డిమాండ్ చేయడం గమనార్హం. లంచం ఇవ్వకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామని కోటే శ్వర రావు హెచ్చరించినట్టు అధికారులు తెలిపారు. నాలుగు రోజులుగా ఇదే విషయం కార్యదర్శికి ఉద్యోగుల మధ్య వాగ్వాదం జరుగుతున్నట్టు తెలిసింది. చిరుద్యోగులమైన తమనూ లంచం డిమాండ్ చేస్తుండడంపై 12 మంది ఉద్యోగులు కోపోద్రిక్తులైపోయి ఏసీబీని ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ రంగరాజు ఆధ్వర్యంలో సీఐ లక్ష్మోజీ, సిబ్బంది గురువారం రాత్రి రెడ్‌హ్యాండెడ్‌గా కోటేశ్వరరావును పట్టుకున్నారు. సొమ్ము తీసుకుని జేబులో పెట్టుకుంటుండగా ఏసీబీ అధికారులు మాటువేసి దాడి చేసి పట్టుకున్నారు. ఏడు నెలల క్రితమే కోటేశ్వరరావు ఇక్కడ విధుల్లో చేరారు.
 
 గతంలోనూ ఆరోపణలే!
 విశాఖ జిల్లాకు చెందిన కోటేశ్వరరావుపై గతంలోనూ ఎన్నో ఆరోపణలున్నాయి. కడపలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడి సంయుక్త కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేశారనే ఆరోపణలున్నట్టు తెలిసింది. గుంటూరు రీజినల్ లైబ్రరీలో పని చేస్తున్నప్పుడు ఆయనపై నిర్భయ కేసు కూడా నమోదైనట్టు అధికారులు తెలిపారు. అదే కేసులో సస్పెండ్ అయ్యి కొన్నాళ్ల తరువాత తిరిగి పోస్టింగ్ తెప్పించుకుని ఇక్కడకు వచ్చారని చెబుతున్నారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పడే సమయంలోనూ ఆయన లంచం డిమాండ్ చేసేవారని సహోద్యోగులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 గతంలో రాజాంలో పనిచేశా. ఏడాదిన్నర క్రితం జి.సిగడాంలో విధుల్లో చేరా. సుమారు రూ.63 వేలు పీఎఫ్ బకాయి ఉంది. అటెండర్లకు సుమారు రూ.50 వేల వరకు బకాయి ఉంది. పెండింగ్ సొమ్ము ఖాతాల్లో జమ చేయమన్నాం. ఆయన అడిగినంత ఇచ్చుకోలేమని కూడా చెప్పాం. చివరకు ఆరుగురు ఉద్యోగులు రూ.3 వేల చొప్పున వసూలు చేసి రూ.18 వేలు కోటేశ్వరరావు చేతిలో పెట్టాల్సి వచ్చింది. ఇది చాలా ఘోరం. అందుకే ఏసీబీని సంప్రదించాం.
 - సీహెచ్. వెంకటేశ్, గ్రంథపాలకుడు, జి.సిగడాం
 

>
మరిన్ని వార్తలు