డీఎఫ్‌ఓ వాహనంపై ఏసీబీ దాడి

7 Jan, 2014 04:42 IST|Sakshi

నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: ఉద్యోగోన్నతి కోసం లంచం ఇచ్చేందుకు జిల్లా అటవీశాఖాధికారి నూకవరపు నాగేశ్వరరావు నగదుతో గుంటూరుకు వెళుతున్నాడన్న సమాచారంతో దగదర్తి మండలంలోని సున్నపుబట్టీ టోల్‌ప్లాజా వద్ద సోమవారం ఉదయం అతని వాహనంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. వాహనంలో ఉన్న రూ.11.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో అతని ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ జె.భాస్కర్‌రావు నేతృత్వంలో ఏసీబీ సీఐలు కృపానందం, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు సోమవారం ఉదయం 6.30 గంటల సమయంలో సున్నపుబట్టీ వద్ద కాపు కాశారు. నెల్లూరు డీఎఫ్‌ఓ నాగేశ్వరరావు బొలేరో వాహనంలో గుంటూరుకు వెళుతుంగా ఆపి తనిఖీలు నిర్వహించారు.
 
 వాహనంలో రూ.11.50 లక్షల నగదు లభిచింది. నగదుకు సంబంధించి వివరాలను అడిగితే  డీఎఫ్‌ఓ పొంతన లేని సమాధానాలు చెప్పారు. నెల్లూరుకు చెందిన తన స్నేహితుడు గుంటూరులోని అతని స్నేహితుడికి ఇవ్వాలని ఇచ్చాడని, అత్యవసర పని నిమిత్తం బ్యాంకులో దాచి ఉంచిన డబ్బులు తీసుకుని గుంటూరు వెళుతున్నానని, అది తన డబ్బులేనని ఇలా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. డీఎఫ్‌ఓని అదుపులోకి తీసుకుని నెల్లూరు అటవీశాఖ కార్యాలయంలోని ఆయన క్వార్టర్స్‌కు తరలించారు. అతను నివాసం ఉంటున్న క్వార్టర్స్‌లో సోదాలు నిర్వహించారు.
 
 కొన్ని కీలక పత్రాలను, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన స్టేట్‌మెంట్‌లు, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పాసు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. అదే క్రమంలో ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు, విలువైన ఫోన్లు ఎప్పుడు? ఎక్కడ కొనుగోలు చేశారు? వాటికి సంబంధించిన బిల్లులు తదితరాలను పరిశీలించారు. అనంతరం అతని కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. కార్యాలయ సిబ్బందిని సైతం విచారించారు.  ఏసీబీ సోదాలతో అటవీశాఖ అధికారుల్లో వణుకు పుట్టించాయి. ఏసీబీ అధికారులు కార్యాలయానికి వస్తున్నారన్న సమాచారంతో పలువురు సిబ్బంది కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. నగదుకు సంబంధించి ఎలాంటి వివరాలు లభ్యం కాకపోవడంతో డీఎఫ్‌ఓను అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
 
 డీఎఫ్‌ఓపై ఫిర్యాదు నేపథ్యంలోనే
 డీఎఫ్‌ఓ నాగేశ్వరరావుపై ఏసీబీ అధికారులకు ఇటీవల ఫిర్యాదు అందినట్లు సమాచారం. నాగేశ్వరరావు జిల్లా అటవీఅధికారిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయింది. నాగేశ్వరరావు తన కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టుకుని కాంట్రాక్టర్ల  నుంచి రూ.లక్షల్లో నగదు లంచాలు తీసుకున్నాడని, ఎర్రచందనం పెద్దఎత్తున అక్రమంగా రవాణా జరుగుతున్నా నియంత్రించలేకపోయారని, దీని వెనుక భారీ స్థాయిలో మామూళ్లు చేతులు మారాయన్న ఆరోపణలు చేసినట్లు తెలిసింది. దీంతో డీఎఫ్‌ఓపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. సోమవారం గుంటూరులో అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశం ఉంది. ఈ సమావేశానికి డీఎఫ్‌ఓ హాజరు కావాల్సి ఉంది. పనిలో పనిగా తన ప్రయోషన్ కోసం ముడుపులు ముట్టచెప్పేందుకు డీఎఫ్‌ఓ వెళుతున్నాడని సమాచారం అందడంతో ఏసీబీ డీఎస్పీ జె. భాస్కర్‌రావు తన సిబ్బందితో కలిసి టోల్‌ప్లాజా వద్ద బొలేరో వాహనంలో తనిఖీలు చేశారు.
 
 ఏసీబీ అదుపులో మధ్యవర్తి
 డీఎఫ్‌ఓకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సదరు ఉద్యోగిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయనను తమ కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలిసింది. సదరు ఉద్యోగి కాంట్రాక్టర్ల నుంచి డీఎఫ్‌ఓ పేరు చెప్పి పెద్ద ఎత్తున లంచాలు గుంజాడన్న ఆరోపణలు ఉండటంతో కాంట్రాక్టర్లను సైతం ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్లు తెలిసింది. మంగళవారానికి పూర్తిస్థాయిలో విచారణ జరిపి డీఎఫ్‌ఓను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 
 నేను ఏం నేరం చేయలేదు
 తాను ఏం నేరం చేయలేదని డీఎఫ్‌ఓ నాగేశ్వరరావు ఏసీబీ అధికారులు, మీడియా ప్రతినిధుల ఎదుట వాపోయాడు. తన స్నేహితుడు గుంటూరులో ఉన్న మరో స్నేహితుడికి డబ్బులు ఇవ్వాలని ఆ నగదు ఇచ్చాడన్నారు. నగదుకు సంబంధించి లెక్కలు ఉన్నాయని, కోర్టులోనే నిజాయితీని నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.
 
 లెక్కలు లేవు :  జె. భాస్కర్‌రావు, ఏసీబీ డీఎస్పీ
 డీఎఫ్‌ఓ వద్ద దొరికిన నగదుకు సంబంధించి ఎలాంటి లెక్కలు లేవు. ఆయన ఆ నగదుకు సంబంధించి పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. నగదు ఎవరిది? ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడికి తీసుకెళుతున్నారు అనే విషయాలను విచారిస్తున్నాం. డీఎఫ్‌ఓను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. మంగళవారం కోర్టులో హాజరుపరుస్తాం. రెండేళ్లుగా అవినీతి అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తున్న ఏసీబీ అధికారులు ఈ ఏడాది ప్రారంభంలోనే తొలిబోణి చేశారు.

మరిన్ని వార్తలు