మరో అవినీతి చేప!

18 Apr, 2017 02:22 IST|Sakshi
మరో అవినీతి చేప!

- ఏపీఈడబ్ల్యూఐడీసీ సీఈ ఇళ్లపై ఏసీబీ దాడులు
- ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు
- రూ.3.95 కోట్ల విలువైన స్థిరాస్తులు, పలు చరాస్తుల గుర్తింపు
- మార్కెట్‌ విలువ రూ.16 కోట్లకుపైనే


సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్‌: ఆంధ్రప్రదేశ్‌ విద్య, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఈడబ్ల్యూఐడీసీ)చీఫ్‌ ఇంజనీర్‌ భూమిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోమవారం దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై హైదరాబాద్‌తోపాటు విజయవాడ కార్యాలయం, తెలంగాణలోని వనపర్తి, మహబూబ్‌నగర్, నల్ల గొండ జిల్లాలు, చెన్నై తదితర ఎనిమిది ప్రాంతాల్లోని ఆయన బంధువుల నివాసాల్లో 12 ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ దాడుల్లో లెక్కలు చూపని రూ.3.95 కోట్ల స్థిరాస్తులతోపాటు రూ.12 లక్షల డిపాజిట్లు, రూ.83 వేల నగదు, 250 గ్రాముల బంగారం, 10 కేజీల వెండి, ఇన్నోవా వాహనం గుర్తిం చినట్లు ఏపీ ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.పి.ఠాకూర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ.16 కోట్లకు పైగానే ఉం టుందని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన జగదీశ్వర్‌రెడ్డి ప్రస్తుతం డిప్యుటేషన్‌ మీద ‘ఏపీఈడబ్లూఐడీసీ’లో చీఫ్‌ ఇంజనీర్‌గా ఉన్నారు. తెలంగాణలోని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లికి చెందిన ఇతను భార్య, ముగ్గురు కుమార్తెల పేరు మీద భారీగా ఆస్తులు సంపాదించినట్లు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ వెల్లడించిన మేరకు ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.

► జగదీశ్వర్‌రెడ్డి భార్య హైమావతి పేరున హైదరాబాద్‌ పంజగుట్టలో రూ.20 లక్షలు విలువ చేసే ఫ్లాట్, వనపర్తిలో నిర్మాణంలో ఉన్న రూ.10 లక్షల విలువైన రెండంతస్తుల షాపింగ్‌ కాంప్లెక్స్, కొత్తకోటలో రూ.30 లక్షల విలువైన 5 వేల చదరపు అడుగుల వైశాల్యం గల జీ ప్లస్‌ 1 ఇల్లు, అమ్మపల్లిలో రూ.10 లక్షల విలువైన 2 వేల చదరపు అడుగుల వైశాల్యంగల ఇల్లు.
► పెద్దకుమార్తె బి.ఇందిరా ప్రియదర్శిని పేరున హైదరాబాద్‌ అంబర్‌పేటలో జీ ప్లస్‌ 2 ఇల్లు, అమ్మపలల్లిలో 28.29 ఎకరాల వ్యవసాయ భూమి, పెద్దమందడిలో 2.20 ఎకరాల భూమి.
► రెండో కుమార్తె స్నిగ్ధ పేరున హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రూ.రూ.87.50 లక్షల విలువైన ఫ్లాట్, అమ్మపల్లిలో 10 ఎకరాలు. మూడో కుమార్తె బి.రవళి పేరున మదనాపురం మండలం అజ్జకొల్లులో  10 ఎకరాల వ్యవసాయ భూమి.
► జగదీశ్వర్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల పేరుపై ఉన్న 4 బ్యాంకు లాకర్లను ఇంకా తెరవాల్సి ఉంది.
► జగదీశ్వర్‌రెడ్డి స్వస్థలం అమ్మపల్లిలో వ్యవసాయ భూములు, రూ.30 లక్షలకు సంబంధించిన ప్రామిసరీ నోట్లు, 21 పట్టాదారు పాసుపుస్తకాలు,  ట్రాక్టర్, పలు కీలక డాక్యుమెంట్లు లభించాయి.

మరిన్ని వార్తలు