పెద్ద 'చేపే'

5 Feb, 2020 13:26 IST|Sakshi
సోదాల్లో దొరికిన నగదు, బంగారం, వెండి వస్తువులు

గిరిజన సంక్షేమ శాఖ ఈఈ ఇళ్లపై ఏసీబీ ఏకకాలంలో దాడులు

రూ.10కోట్లు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తింపు

ఇళ్లల్లో నగదు రూ.7లక్షలు, బ్యాంక్‌ ఖాతాలో 30 లక్షలు స్వాధీనం

శ్రీకాకుళం, పార్వతీపురంలలో ఏకకాలంలో దాడులు

నేడు ఏసీబీకోర్టులో హాజరుపరుస్తున్న అధికారులు  

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పార్వతీపురం గిరిజన సంక్షేమ శాఖ (ఐటీడీఏ)లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఈఈ, ఎఫ్‌ఏసీ)గా పనిచేస్తున్న తూతిక మోహనరావు ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగవారం దాడులు చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురంలలో మంగళవారం తెల్లవారుజాము నుంచి మోహనరావు ఇళ్లపై దా డులు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆదా యానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో ఈఈ స్థిరాస్తులు, బంగారం, వెండి, గృహోపకరణాలు, గృహాలంకరణ, నగదు అంతా కలిపి ప్రస్తుత మార్కెట్‌ విలువను అంచనా వేశారు. దీని ప్రకారం మొత్తం రూ.10కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్లు డీఎస్పీ విలేకరులకు తెలిపారు. దీనిలో బంగారం580 గ్రాములు విలువ రూ.27లక్షలుగాను, వెండి రెండు కేజీలు రూ.1.50లక్షలుగాను, గృహాలంకరణాల విలువ రూ.16లక్షలు, ఆయన ఇంట్లో నగదు రూ.7లక్షలు, బ్యాంక్‌ ఖాతాలో రూ.30లక్షలున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటితో పాటు ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.  తూతిక మోహనరావు వాస్తవానికి డిప్యూ టీ ఇంజనీర్‌ (డీఈ) కేడర్‌లో పార్వతీపురం, ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్నారు. ఈయన గతంలో  సీతంపేట, నర్సీపట్నంలలో ఐటీడీఏల్లో డీఈగా కూడా పనిచేశారు. అనంతరం పార్వతీపురంలో ఈఈ పోస్టు ఖాళీగా ఉండడంతో విషయం తెలుసుకున్న మోహనరావు తన పలుకుబడితో ఈఈగా అదనపు బాధ్యతలు చేపట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మోహనరావు ఇంట్లో దస్త్రాలు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు
సిక్కోలులో కలకలం
శ్రీకాకుళం నగరంలోని ఎల్‌బీఎస్‌ కాలనీలో సొంత నివాసంలో ఉంటున్న మోహనరావుకు విజయనగరం జిల్లా పార్వతీపురంలో కూడా అద్దె ఇల్లు కూడా ఉంది. ఈ ఇళ్లల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి మంగళవారం దాడులు నిర్వహించారు. తెల్లవారు జామునే పార్వతీపురంలో తొలుత దాడులు చేశారు. అనంతరం మోహనరావును శ్రీకాకుళంలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో మోహనరావు ఇళ్లల్లో పెద్ద మొత్తంలో నగదు, వెండి, బంగారం, విలువైన ఆస్తుల పత్రాలు గుర్తించి వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురంలో ఆయన ఉన్న అద్దె ఇంటిలో రూ.3.5 లక్షలు, శ్రీకాకుళంలో రూ.3.5 లక్షలు ఉన్నట్లు గుర్తించారు.

నేడు ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తాం: ఏసీబీ డీఎస్పీ
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న తూతిక మోహనరావును బుధవారం విశాఖపట్నం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సాక్షికి తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు మహేశ్వరరావు, భాస్కర్, సత్యారావులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

సింగూరు ఇసుక ర్యాంపు తాత్కాలికంగా మూసివేత
ఆమదాలవలస రూరల్‌: పొందూరు మండలం సింగూరు ఇసుక ర్యాంపును తాత్కాలికంగా మూసివేశారు. సింగూరు రెవెన్యూలో సేకరించిన ఇసుకను దూసిలో నిల్వ చేసి అవసరాలకు ఏపీఎండీసీ ద్వారా తరలించేవారు. ఇసుక ర్యాంపుపై ఇటీవల పోలీసులు దాడులు నిర్వహించగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 15 లారీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కోటేశ్వరరావు తెలిపారు. ఇసుక ర్యాంపు నిర్వాహకులు హరనాథరావు, భరత్, వాసులతో పాటు ముగ్గురు మైన్స్‌ అధికారులపై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరిపై కేసులు నమోదు చేయడంతో ర్యాంపులో ఉన్న వారు భయపడి ర్యాంపును ఆపేసినట్లు తెలిపారు. అందుకే ఇసుక ర్యాంపును తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు. ఇసుక ర్యాంపులో అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా విధు ల నుంచి అధికారులు తొలగించారు.ఇసుక ర్యాంపు నిర్వహణలో వారి విధానాల వల్ల అక్రమంగా ఇసుక తరలిపోయినట్లు గుర్తించిన మైన్స్‌ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు