ఏసీబీ వలలో అవినీతి వీఆర్వో

1 Jun, 2014 02:16 IST|Sakshi
ఏసీబీ వలలో అవినీతి వీఆర్వో

వింజమూరు, న్యూస్‌లైన్: పాసుపుస్తకాలు మంజూరు చేయాలని ఏడాదిగా  వేడుకుంటున్న ఓ మహిళను లంచం ఇవ్వాలని తిప్పుకుంటున్న నందిగుంట వీఆర్వో రొడ్డా శేషయ్య ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు. రూ.5 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఈ ఘటన వింజమూరు తహశీల్దార్ కార్యాలయంలో శనివారం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారుల కథనం మేరకు..నందిగుంటకు చెందిన అనమర్లపూడి సీతమ్మ భర్త మాలకొండయ్య పదేళ్ల క్రితం మృతిచెందాడు.
 
 ఆమె మామ కొండయ్య కూడా ఏడాది క్రితం చనిపోయాడు. భర్త, మామ ఇద్దరూ మృతిచెందడంతో కొండయ్య పేరు మీదున్న 3.2 ఎకరాల అసైన్డ్ పట్టాదారు పాసుపుస్తకాలను తన పేరు మీద మార్చాలని ఆమె వీఆర్వో శేషయ్యను ఏడాది క్రితం కోరింది. అప్పటి నుంచి పలుమార్లు వీఆర్వో చుట్టూ తిరిగినా ఫలితం కరువైంది. మే 28వ తేదీన మళ్లీ దరఖాస్తు చేసుకుంది. పాసుపుస్తకంలో పేరు మార్చి కొత్తవి ఇవ్వాలంటే రూ.10 వేలు చెల్లించాల్సిందేనని వీఆర్వో శేషయ్య హుకుం జారీ చేశాడు. తాను నిరుపేదనని, తన వద్ద రూ.5 వేలే ఉందని ఆమె ప్రాధేయపడినా వీఆర్వో కనికరించలేదు. 29వ తేదీన రూ.5 వేలు తీసుకుని, మిగిలిన రూ.5 వేలు తీసుకువస్తేనే పాసుపుస్తకాల్లో పేరు మారుస్తానని స్పష్టం చేశాడు. అది కూడా శనివారం లోగా చెల్లించాలని మెలిక పెట్టాడు. దిక్కుతోచని సీతమ్మ నెల్లూరులోని ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు రూ.5 వేలను శనివారం తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న వీఆర్వో శేషయ్యకు అందజేసింది. నగదు తీసుకున్న శేష య్య వెంటనే ఆ మొత్తాన్ని ప్యాంటు జే బులో పెట్టుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ కె.ఎస్.నంజుండప్పతో పాటు ఇన్‌స్పెక్టర్లు ఒక్కసారిగా కార్యాలయంలోకి ప్రవేశించి వీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని రసాయన పరీక్షల అనంతరం కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్లు వెంకటెశ్వర్లు, కృపానందం, శ్రీనివాసరావు ఉన్నారు.
 
 ఏడాదిగా తిరుగుతున్నా
 పాసు పుస్తకం కోసం ఏడాదిగా తిరుగుతున్నా. రూ. 10 వేలిస్తేనే పాసుపుస్తకం ఇస్తానని వీఆర్వో అన్నాడు. రూ.5 వేలిచ్చినా ఒప్పుకోకుండా మిగిలిన రూ.5 వేలు అడిగాడు. గత్యంతరంలేకే ఏసీబీ అధికారులను ఆశ్రయించా. అనమర్లపూడి సీతమ్మ, బాధితురాలు
 

మరిన్ని వార్తలు