ప్రభుత్వ ఆసుపత్రులపై ఏసీబీ కొరడా!

27 Feb, 2020 21:01 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగొ విడతలో భాగంగా ఏసీబీ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రులపై గురువారం కొరడా ఝలిపించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో వందమంది సభ్యులతో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై మొదటి రోజు నిర్వహించిన తనిఖీల్లో డాక్టర్లు, నర్సులు కనీసం డ్రెస్కోడ్, ఐడీకార్డులు కూడా మేయింటెయిన్ చేయనట్లుగా అధికారులు గుర్తించారు.  

అంతేగాక రోగులను ప్రైవేటు క్లినిక్‌లకు తరలిస్తూ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. రోగులకు ఇచ్చే ఆహరంలో నాణ్యత లేకపోవడంతో పాటు బియ్యం కొరత ఉన్నట్లుగా తప్పుడు లెక్కలు చూపిస్తున్నట్లుగా నిర్దారించారు. ఇక రిజస్టర్‌లో ఉన్న మందులకు, స్టాక్‌కు మధ్య ఉన్న అవకతవకల గుట్టును రట్టు చేశారు. 

అన్ని ఆసుపత్రిలో అపరిశుభ్రత, చాలా చోట్ల వాటర్ లీకేజీ, ఆరోగ్యశ్రీ వార్డులో రోగులు లేకపోయినా ఉన్నట్లు చూపిస్తున్నట్లు గుర్తించారు. ఇక కొన్ని ఆసుపత్రుల్లో కండిషన్‌లో లేని 108 అంబులెన్స్‌ వాహనాలు నడుపుతున్నట్లుగా  అధికారులు గుర్తించారు. ఇక రేపు(శుక్రవారం) కూడా తనిఖీలను కొనసాగించనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు